వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

- January 24, 2026 , by Maagulf
వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

అమెరికా: అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోతోంది. దశాబ్ద కాలంలోనే ఎన్నడూ చూడని రీతిలో భారీ మంచు తుఫాను దేశంలోని సగానికి పైగా జనాభాను గృహనిర్బంధం చేసింది.టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు సుమారు 2,000 మైళ్ల మేర విస్తరించిన ఈ మంచు ముప్పు, కోట్లాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఇది కేవలం చలి మాత్రమే కాదు.. ప్రాణాలను హరించే ‘గడ్డకట్టే మృత్యువు’ అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరి 23 నుంచి ప్రారంభమైన ఈ తుఫాను ప్రభావంతో అమెరికాలోని దాదాపు 30 రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. సుమారు 20 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం విపరీతమైన చలి మరియు మంచు హెచ్చరికల నీడలో ఉన్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ వంటి ప్రధాన నగరాల్లో సుమారు ఒక అడుగు (12 అంగుళాలు) మేర మంచు పేరుకుపోవచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇది రెండు అడుగుల వరకు కూడా వెళ్లొచ్చని వాతావరణ శాఖ (NWS) తెలిపింది.

తుఫాను కంటే భయంకరమైనది అది మోసుకొచ్చిన ఆర్కిటిక్ చలి గాలులు. మిన్నియాపాలిస్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 21 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయాయి. చలి గాలుల ప్రభావం వల్ల కొన్ని చోట్ల మైనస్ 50 డిగ్రీల చలి అనుభూతి కలుగుతోంది. ఇంతటి చలిలో బయటకు వస్తే నిమిషాల్లోనే ఫ్రాస్ట్‌బైట్ (చర్మం గడ్డకట్టడం) అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్తంభించిన రవాణా.. అంధకారంలో నగరాలు: ఈ వారాంతంలో వేలాది విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. భారీ మంచుతో పాటు గట్టకట్టిన ఐస్ వల్ల చెట్లు విరిగి విద్యుత్ తీగల పై పడటంతో లక్షలాది ఇళ్లు చీకటిలో మగ్గుతున్నాయి. ప్రజలు ఆహారం, అత్యవసర మందులను నిల్వ చేసుకోవాలని 15 రాష్ట్రాల గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com