కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్‌ భేటీ

- January 24, 2026 , by Maagulf
కేటీఆర్, హరీశ్ రావు లతో  కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో (BRS) రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ పరిణామాల మధ్య మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఈ మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లనున్నారు.అక్కడ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వీరిద్దరితో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్, హరీశ్ రావులను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ దర్యాప్తు దూకుడుగా కొనసాగుతుండటంతో, పార్టీ నాయకత్వం కొంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతేకాదు, అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న చర్చ బీఆర్‌ఎస్ వర్గాల్లో జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లోనే కేసు తాజా పరిణామాలు, సిట్ విచారణలపై పార్టీ తీసుకోవాల్సిన వైఖరి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై కేసీఆర్‌తో విస్తృతంగా చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. (Farmhouse) చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలి, రాజకీయంగా ఎలా స్పందించాలి అన్నదానిపై నేతలు అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నేతలు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాల పై మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు, మున్సిపల్ ఎన్నికలుఈ రెండు కీలక అంశాలు ఈరోజు ఎర్రవల్లి ఫాంహౌస్ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com