ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..

- January 24, 2026 , by Maagulf
ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
అల్ ఐన్: ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే, యూఏఈ చట్టాలు బాధితులకు అండగా నిలుస్తున్నాయి. తాజాగా అల్ ఐన్ (Al Ain) కోర్టు ఆన్లైన్ మోసానికి గురైన ఒక మహిళకు అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు ఆమెకు ఏకంగా 300,000 దిర్హమ్స్ పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.అసలేం జరిగింది?
 
నిందితుడు మరియు అతని ముఠా ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ మోసానికి పాల్పడ్డారు.
నకిలీ అధికారి: తాము ‘వినియోగదారుల రక్షణ విభాగం’ (Consumer Protection Authority) అధికారులమని చెప్పుకుంటూ మహిళకు ఫోన్ చేశారు.
ఆమె చేసిన పాత ఫిర్యాదును పరిష్కరిస్తున్నామని నమ్మబలికారు. అంతేకాకుండా, ఆమె బ్యాంక్ ఖాతాను భద్రపరచకపోతే (Secure) నష్టపోతారని భయపెట్టారు.
వారి మాటలు నమ్మిన ఆ మహిళ, తన బ్యాంకింగ్ వివరాలను వారికి ఇచ్చింది. ఆ వివరాలతో కేటుగాళ్లు ఆమె ఖాతాలోని డబ్బును విత్-డ్రా (Withdraw) చేయడమే కాకుండా, ఆమె పేరు మీద లోన్లు కూడా తీసుకొని డబ్బును బదిలీ చేసుకున్నారు.
 
కోర్టు తీర్పు ఇదే:
ఈ ఘటనలో బాధితురాలు మొత్తం 270,000 దిర్హమ్స్ నష్టపోయింది. దీనిపై ఆమె సివిల్ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన అల్ ఐన్ కోర్టు ఈ క్రింది విధంగా తీర్పు ఇచ్చింది:
1. రీఫండ్: మోసపోయిన 270,000 దిర్హమ్స్ను నిందితుడు వెనక్కి ఇవ్వాలి.
2. అదనపు పరిహారం: ఈ ఘటన వల్ల ఆమెకు కలిగిన మానసిక వేదనకు (Emotional distress) మరియు ఇతర నష్టాలకు గాను అదనంగా 30,000 దిర్హమ్స్ చెల్లించాలి. మొత్తంగా బాధితురాలికి 3 లక్షల దిర్హమ్స్ చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు క్రిమినల్ కోర్టులో కూడా నిందితుడి నేరం రుజువయ్యింది.
 
జాగ్రత్త.. అధికారుల హెచ్చరిక!
యూఏఈ అధికారులు ప్రజలకు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు:
బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు లేదా వినియోగదారుల రక్షణ అధికారులు ఎప్పుడూ ఫోన్లో మీ బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు లేదా OTP అడగరు.
ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడిగితే వెంటనే కాల్ కట్ చేయండి.
ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
 
--బాజీ షేక్(యూఏఈ)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com