నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం

- February 03, 2026 , by Maagulf
నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి ఆటోమేటివ్ రంగంలో సంచలనం సృష్టించింది. వాహనాలపై ఆసక్తి కేవలం కార్ల వరకే పరిమితం కాకుండా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల వరకు విస్తరించినట్టు ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. తాజాగా జరిగిన ఒక ప్రత్యేక వేలంలో ఏపీ వాసి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ DDC 001 ను రూ. 2.08 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది దేశంలోనే ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా రికార్డు సృష్టించింది. ఈ అరుదైన వేలం ప్రముఖ లగ్జరీ ఆటోమోటివ్ ప్లాట్‌ఫామ్ బిగ్ బాయ్ టాయ్జ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆక్షన్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ వేలం జరగగా.. మొదట ఈ ఈవెంట్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ, త్వరలోనే అందరి దృష్టి DDC 001 నంబర్ చుట్టూ పడింది. ఒక సాధారణ నంబర్ ప్లేట్‌ (Number plate)కు ఇంత భారీ ధర పలకడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఈ “DDC 001” నంబర్ ప్లేట్ గతంలో బిగ్ బాయ్ టాయ్జ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ అహుజా పేరు మీద ఉంది. అయితే తాజా వేలం ప్రక్రియలో అనేక మంది సంపన్నులు ఆసక్తి చూపించినప్పటికీ, చివరికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిరణ్ కోల్పాకుల అత్యధికంగా రూ. 2.08 కోట్ల బిడ్ వేసి ఈ నంబర్‌ను దక్కించుకున్నారు. ఈ కొనుగోలుతో Kiran Kolpakula దేశవ్యాప్తంగా ఆటోమోటివ్ కలెక్టర్లలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ అమ్మకం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, భారతదేశంలో ఫ్యాన్సీ, సింబాలిక్ నంబర్ ప్లేట్లకు ఉన్న డిమాండ్ ఎంతగా పెరిగిందో చూపించే ఉదాహరణగా నిలిచింది. బిగ్ బాయ్ టాయ్జ్ వ్యవస్థాపకుడు జతిన్ అహుజా మాట్లాడుతూ.. ఈ వేలానికి వచ్చిన స్పందన కార్లను మించిపోయే విలువ కలిగిన అరుదైన ఆస్తుల పట్ల కలెక్టర్లలో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ఈ రూ. 2.08 కోట్ల ప్లేట్ అమ్మకం, గతంలో ఉన్న జాతీయ రికార్డును సులభంగా అధిగమించింది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గుర్తింపు పొందినది HR88B8888. ఇది గత ఏడాది నవంబర్‌లో జరిగిన అధికారిక వేలంలో రూ. 1.17 కోట్లకు అమ్ముడైంది. ఆ నంబర్ ప్లేట్ కూడా పునరావృత అంకెల కారణంగా విపరీతమైన బిడ్డింగ్‌ను ఆకర్షించింది. దీనికంటే ముందు KL 07 DG 0007 నంబర్ ప్లేట్ రూ. 46 లక్షలకు అమ్ముడై అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఈ నంబర్‌ను లిట్‌మస్7 వ్యవస్థాపకుడు వేణు గోపాలకృష్ణన్ తన ఖరీదైన లాంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మాంటే కోసం కొనుగోలు చేశారు. ఆ సమయంలో నంబర్ ప్లేట్ ధర, కారు ధర మధ్య ఉన్న వ్యత్యాసం పెద్ద చర్చకు దారితీసింది. బిగ్ బాయ్ టాయ్స్ ఆక్షన్ హౌస్ ఈ వేలాన్ని కేవలం అరుదైన నంబర్ ప్లేట్లకే పరిమితం చేయకుండా, ప్రముఖ సెలబ్రిటీలకు చెందిన లగ్జరీ కార్ల వరకు విస్తరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com