1400 మంది ప్రయాణించగల పే..ద్ద బస్సు.. ..

- August 03, 2016 , by Maagulf
1400 మంది ప్రయాణించగల పే..ద్ద బస్సు.. ..

1400 మంది ప్రయాణించగల పే..ద్ద బస్సు.. అంతేకాదు.. ఓ పక్క బస్సు రోడ్డుపై వెళ్తున్నా.. దాని కింది నుంచి కార్లు శరవేగంగా దూసుకెళ్లే అధునాతన టెక్నాలజీ.. చైనాలోని బీజింగ్‌కు చెందిన ట్రాన్సిట్‌ ఎక్స్‌ప్లోర్‌ బస్‌ అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన ఈ బస్సు మోడల్‌ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. అయితే తొందర్లోనే ఈ బస్సు చైనా రోడ్లపై సందడి చేయనుంది. ల్యాండ్‌ ఎయిర్‌బస్‌గా పిలిచే ఈ బస్సును చైనా సోమవారం పరీక్షించింది.
రోడ్లపై వాహనాల విస్తీర్ణం, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు టీఈబీ-1 పేరుతో ఈ ఏడాది మే నెలలో బస్సు మోడల్‌ను విడుదల చేసింది సంస్థ. తాజాగా ఈ బస్సును హెబీ ప్రావిన్స్‌లోని క్విన్‌హువాంగ్‌దావో రోడ్లపై పరీక్షించారు. 22 మీటర్ల పొడవు, 7.8 మీటర్ల వెడల్పు గల ఈ బస్సును ప్రత్యేక ట్రాక్‌పై నడిపించారు. సాధారణ బస్సుల కంటే ఈ బస్సు కంపార్ట్‌మెంట్‌ రోడ్డుకు చాలా ఎత్తులో ఉండటంతో దీని కింది నుంచి కార్లు సులువుగా వెళ్లిపోవచ్చు. బస్సు నడుస్తున్నా.. ఆగి ఉన్నా కూడా రోడ్డు మీద ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఉండదు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ బస్సులో 1400 మంది ప్రయాణించొచ్చు.అంతేగాక పూర్తి ఎలక్ట్రిసిటీతో నడిచే ఈ బస్సు పర్యావరణహితంగా ఉంటుంది. 40 సాధారణ బస్సులతో ఈ ఒక్క బస్సు సమానమవడంతో సంవత్సరానికి దాదాపు 800 టన్నుల ఇంధన వాడకాన్ని తగ్గించొచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేగాక దీని వల్ల ఏడాదికి 2,480 టన్నుల కార్బన్‌ ఉద్గారాలు కూడా తగ్గుతాయట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com