బీప్లస్ విత్ భాస్కర్ విశ్వ వేదిక పై 26.2 గంటల అఖండ కథా యజ్ఞం
- March 25, 2026
ప్రపంచ కథాకథన దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 21, 22 తేదీలలో “బీప్లస్ విత్ భాస్కర్” విశ్వ వేదికపై జరిగిన “ప్రపంచ కథాకళ ఉత్సవం 2026” సాహితీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. “చీకటిలో వెలుగు” అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమం 26.2 గంటల పాటు నిరంతర కథా మారథాన్‌గా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ మహోత్సవంలో 20 దేశాలకు చెందిన 135 మందికి పైగా కథకులు పాల్గొని తమ కథల ద్వారా అక్షరాలకు జీవం పోశారు. ప్రముఖ కళాకారుడు కూచి సాయి శంకర్ రూపొందించిన లోగో ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేవలం వినోదానికి మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతను కూడా ప్రతిబింబిస్తూ “శ్రీతరు సంకల్పం” ద్వారా రైతుల పొలాల్లో వేలాది మొక్కలు నాటే కార్యక్రమానికి ఈ వేదిక దోహదపడింది. అలాగే సాహితీ దిగ్గజాలైన శ్రీపాద, విశ్వనాథ, గురజాడ, యద్దనపూడి వంటి ప్రముఖుల పేర్లతో 13 వేదికలను ఏర్పాటు చేసి వారికి ఘన నివాళి అర్పించారు.
పేదరాశి పెద్దమ్మ, పంచతంత్రం వంటి పౌరాణిక కథల పఠన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవం ముందుకు సాగింది. మాతృభాష ప్రాముఖ్యతను కొత్త తరం ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం కార్యక్రమం అంతటా కనిపించింది.
ప్రముఖ ఆకాశవాణి గళం శారదా శ్రీనివాసన్ “ఊరట” కథతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, అయ్యగారి వసంతలక్ష్మి, రాజేశ్వరి ఉదయగిరి, ఓలేటి పార్వతీశం, వెంపటి కామేశ్వరరావు, కొప్పర్తి రాంబాబు తదితరులు తమ కథలతో శ్రోతలను అలరించారు. ఆచార్య డా.అద్దంకి శ్రీనివాస్, వంగూరి చిట్టెన్ రాజు, మందపాటి సత్యం, పొత్తూరి విజయలక్ష్మి వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఈ ఉత్సవంలో సాంకేతికతకు ప్రత్యేక స్థానం కల్పించారు. ప్రతి కథకు అనుగుణంగా కృత్రిమ మేధ (AI) సహాయంతో రూపొందించిన చిత్రాలను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధునిక సాంకేతికతను తెలుగు సాహిత్యంతో మేళవించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యూట్యూబ్, ఫేస్‌బుక్ వేదికలపై ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని వేలాది మంది వీక్షించారు. బీప్లస్ అధినేత విజయ భాస్కర్ రాయవరం మరియు ఆయన బృందం కృషితో ఈ ఉత్సవం విజయవంతమైంది.



తాజా వార్తలు
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి







