పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్

- March 30, 2026 , by Maagulf
పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్

చెన్నై: ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ సోమవారం తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో రిటర్నింగ్ అధికారికి విజయ్ తన నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ తదితర సీనియర్ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

విజయ్ నామినేషన్ సందర్భంగా వ్యాసర్పాడి ప్రాంతం జనసంద్రమైంది. తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది మంది టీవీకే కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయన కాన్వాయ్ వెళ్తున్న మార్గాల్లో జనం పోటెత్తడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒకానొక దశలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విజయ్ వాహనం ఆగినప్పుడు, వాహనదారులు సెల్ఫీల కోసం ఎగబడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల బరిలో మొదటిసారిగా దిగుతున్న టీవీకే పార్టీకి ఈ స్థాయిలో మద్దతు లభించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తన పార్టీని విజయ్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన స్థానంగా మారింది. విజయ్ రాకతో ఇక్కడ ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com