`అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు మన పెద్దలు

- April 01, 2026 , by Maagulf
`అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు మన పెద్దలు
భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ మొత్తం 17 అంశాలతో ‘సుస్థిరాభివృద్ది లక్ష్యాల’ (ఎస్డీజీస్) ను యూఎన్ ప్రపంచ దేశాలకు నిర్దేశించింది.దాదాపు రెండు వందల దేశాలు దీన్ని అంగీకరించి, సంతకాలు చేసి, ఆ దిశలో చర్యలు చేపట్టి ముందడుగు వేస్తున్నాయి.అందులో మన దేశం ‘భారత’ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం పుష్కర కాలం కిందటే పేదల ఆకలి తీర్చే ఒక ప్రయత్నం చేపట్టింది.
ఆకలి లేని వ్యవస్థ కోసం 2014 లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించగా, తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆరఎస్ ప్రభుత్వం దీన్ని మరింత విస్తరించింది. నామ మాత్రపు ఖర్చు, అయిదు రూపాయలకే ఓ పూట భోజనం పెట్టి కడు నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ‘అన్నపూర్ణ క్యాంటీన్ల’ను ఏర్పాటు చేసింది.అధిక మొత్తం సబ్సిడీతో దీన్ని చేపట్టింది. మొదట 8 సెంటర్లతో మొదలైనా....ఇప్పుడు పేరు మారి, ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ పేరిట జిహెచ్‌ఎంసి పరిధిలో, జంటనగరాల శివార్లలో కలిపి ఆ సెంటర్ల సంఖ్య 150కి చేరింది. మధ్యాహ్నం అందించే భోజనానికి తోడు, ఉదయం 5 రూపాయలకే టిఫిన్ (కొన్ని చోట్ల) అందించే సౌకర్యాన్ని  ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. పరిమితంగా కొన్ని చోట్ల (ముఖ్యంగా ఆస్పత్రుల వద్ద) రాత్రి పూట‌ భోజనం కూడా పెడుతున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్లు  ఇదివరకున్న డబ్బాల స్థానంలో పలు సౌకర్యాలతో ‘కంటెయినర్‌’లను సమకూర్చే నిర్ణయాన్ని 2025లో ప్రభుత్వం తీసుకొని పథకాన్ని కొంత విస్తరించింది. డబ్బాలకు బదులు ‘కంటెయినర్లు’ వచ్చాక ఆంబియెన్స్ కొంచెం మెరుగయి, భోజనానికి వచ్చే వారి సంఖ్య పెరిగినట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. డబ్బాల స్థానంలో కాంటెయినర్లు ఏర్పాటు చేసిన తరువాత అన్నపూర్ణ క్యాంటిన్ పేరును ఇందిరమ్మ క్యాంటిన్‌గా మార్చి రాష్ట్ర ప్రభుత్వం బ్రాండింగ్ చేస్తుంది. 
 
ప్రజాసంక్షేమ లక్ష్యంతో చేపట్టిన ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ నిర్వహణ ఎలా ఉంది? టిఫిన్లు-భోజనాల నాణ్యత, ఆహారంలో పోషకాలు, క్యాంటీన్లలో వసతులు, పరిసరాల శుచి-శుభ్రత, సిబ్బంది శ్రద్ద`నిబద్దత, తినేవాళ్లలో సంతృప్తి స్థాయి, వారేం కోరుకుంటున్నారు`అసలేం లభిస్తోంది, ఈ పథకం మెరుగుకు వారేం సూచిస్తున్నారు... తదితర విషయాలను లోతుగా తెలుసుకునేందుకు ‘పీపుల్స్ పల్స్ రిసర్చ్ సంస్థ’ ఒక సమగ్ర సర్వే నిర్వహించింది. 
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 30 వరకు, దాదాపు నెలరోజులపాటు జిహెచఎంసి పరిధిలో, జంటనగర శివార్లలో నలువైపులా విస్తరించి ఉన్న సగానికి పైగా క్యాంటీన్లను (శాస్త్రీయ శాంపిల్ 76/150) సర్వే బృందాలు ప్రత్యక్షంగా సందర్శించాయి. ‘మెనూ’ను పాటిస్తున్నారా తెలుసుకోవడానికి నికరంగా నెలరోజులపాటు గమనించింది. అక్కడి పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించడమే కాకుండా క్యాంటీన్ల నిర్వహకులు, టిఫిన్`భోజనాలు పెట్టే సిబ్బంది, సెంటర్లకు వచ్చి తింటున్నవారు, బాక్సుల్లో తీసుకుపోతున్నవారు....ఇలా అందరినీ పలుకరించి, వారి నుంచి పలు వివరాలు సేకరించి, ఆ డాటాను విశ్లేషించింది. అన్ని క్యాంటీన్లకు ఒకేచోట ఆహారం వండి, అందిస్తున్న`హెచ్‌కెఎం` సంబంధించిన సిబ్బందితో మాట్లాడి... వంట ప్రదేశాన్ని, వంటకం ప్రక్రియను పరిశీలించడానికి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ‘ఎచ్‌కెఎం’ సంస్థ అనుమతి కోరగా... జిహెచ్‌ఎంసి అధికారుల ద్వారా అనుమతి తీసుకొని వస్తేనే కిచెన్, ఇతర అంశాలను పరిశీలించడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. 
 
ఇందిరమ్మ క్యాంటిన్ల పై నెలరోజులపాటు సమగ్ర సర్వేను పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్, సమాచార హక్కు మాజీ కమీషనర్ ఆర్.దిలీప్‌రెడ్డి మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది.  పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థకు చెందిన సీనియర్ రీసెర్చర్లు జి.మురళీకృష్ణ, అఖిల, ప్రదీప్ తదితరులు ఈ సర్వే నిర్వహించారు.  సర్వే ప్రధాన రిపోర్టుకు వివిధ టేబుల్స్, చార్ట్స్‌తో కూడిన సమగ్ర సమాచారంతో ఒక అనుబంధ నివేదిక దీని వెంట జతపరచడమైనది.
 
గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి  ఓ విధానపత్రమే లేకపోవడం, ఏ స్థాయిలో ఎవరి విధులు-బాధ్యతలు ఏమిటనే స్పష్టత ఇవ్వకపోవడం ఓ పెద్ద లోపంగా కనిపిస్తోంది. దానికి తోడు అన్ని స్థాయిల్లో శ్రద్దాసక్తులు లోపించడం, అందించే ఆహారం విషయంలో రుచి, నాణ్యత, పోషక విలువలు ఏవీ పట్టించుకోకపోవడం, శుచి-శుభ్రత సమయపాలన వంటివి గాలికి వదిలేయడం, భయంకరమైన నిర్వహణా వైఫల్యం, పై నుంచి నిఘా`తనిఖీలు మందగించడం... వెరసి ఇదొక దండుగమారి వ్యవహారంగా తయారయింది. ప్రధాన లోపం ఈ పథకాన్ని చూసే దృష్టికోణంలోనే ఉంది. ‘అయిదు రూపాయలకు ఇంతకన్నా ఇంకేం పెడతాం?’ అన్న నిర్లక్ష్యంపెట్టే వాళ్లలో, ‘ఇంతకన్నా ఎవరైనా ఏం పెడుతారులే అయిదు రూపాయలకు’ అన్న క్షమ, ఉదాసీనత తినేవాళ్లలో.... కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దాంతో ఉన్నత లక్ష్యం నిలువునా నీరుగారిపోతోంది. ఇదొక తప్పుడు భావన, ఎందుకంటే, పేరుకు ‘అయిదు’ రూపాయలే అయినా, ప్రతి టిఫిన్- భోజ‌నాని  కి అంతకు నాలుగయిదు రెట్ల అధికమొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో పథకం నిర్వహకులకు చెల్లిస్తోంది. ఇది, అన్నం తినే అత్యధికులకు (80 శాతం మందికి) తెలియదు.
 
ఆశించిందొకటి-జరుగుతున్నదొకటి 
సంక్లిష్ట, వ్యయభరితమైన నగర జీవితంలో నిరుపేదలు, బడుగులు, బలహీనులకు అయిదు రూపాయలకే భోజనం అందించే ‘అన్నపూర్ణ క్యాంటీన్ల’ను 2014 మార్చిలో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. రాజధాని హైదరాబాద్‌లో 8 సెంటర్లతో ఇది మొదలైంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్చెమ్సీ) మొత్తం వ్యయం భరిస్తుండగా ‘హెచ్‌కేఎం’ స్వచ్ఛంద సంస్థ అవసరమైన ఆహారం వండి, వేర్వేరు సెంటర్లకు చేరవేసి, పంపిణీ చేయిస్తోంది. స్వచ్ఛంద సంస్థగా ‘హెచ్‌కేఎం’ కు  మంచి పేరే ఉన్నా ఆహార నాణ్యత విషయంలో పలు విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్నా క్యాంటీన్ల’కు ఆహారం అందిస్తున్నా, అక్కడి కన్నా ఇక్కడ నాణ్యతలో రాజీపడుతున్నట్టు, అందుకు ఎప్పటికప్పుడు సరైన తనిఖీలు లేకపోవడమే ముఖ్య కారణమైనట్టు నిర్దిష్ట ఆరోపణలున్నాయి. “ఇందిరమ్మ క్యాంటీన్ల”కు ఆహార రవాణా, క్యాంటీన్ల నిర్వహణ కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా  ‘హెచ్‌కెఎం’ సంస్థ నిర్వహిస్తోంది.  పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వివిధ క్యాంటిన్లలో పనిచేస్తున్న సిబ్బంది నుండి సేకరించిన సమాచారం ప్రకారం 150 క్యాంటిన్లను ప్రధానంగా ముగ్గురు కాంట్రాక్టర్లు సిబ్బందిని సమకూర్చడం, వారి ద్వారా సెంటర్ల నిర్వహణ బాధ్యతలు జరిపిస్తున్నారు. 
 
ఇందిరమ్మ క్యాంటిన్లలో ప్రధానంగా దిన కూలీలు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వలస కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిరు ఉద్యోగులు, పరిమితంగా విద్యార్థులు, ఇతరులు తింటున్నారు. మహిళలు చాలా తక్కువ. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సెంటర్ల సంఖ్య పెరుగుదల తప్ప పెద్ద మార్పేమీ లేకుండా పథకం యధాతథంగా నడిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు ‘పాన్‌షాప్‌` నమూనాలో ఉండే డబ్బాల ద్వారా జరుగుతున్న క్యాంటీన్ల నిర్వహణను ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కంటెయినర్‌’లకు మార్చింది. కంటెయినర్లలో ఆహారం డిష్‌లు, ప్లేట్లు పెట్టుకోవడానికి బేస్, హ్యాండ్ వాష్ బేసిన్, ఆర్వో వాటర్ పాయింట్, ఫ్యాన్లు-లైట్లు తదితర సదుపాయాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ కంటెయినర్లలో ఇవేమీ పనిచేయడం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఇందిరమ్మ కంటెనయిర్ల  కోసం రూ.11.43 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. 2025 నుంచే, మరో సదుపాయం పెరిగింది. మధ్యాహ్నం అందించే భోజనానికి తోడు ఉదయం పూట రూ. 5 కే టిఫిన్ అందించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. మూడో వంతు సెంటర్లలో ఇది అందుబాటులో ఉంది. రాత్రిపూట రూ.5 కే భోజనం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్ తదితర ఆస్పత్రుల‌ వద్ద క్యాంటీన్లలో ఇస్తున్నారు. వసతుల లేమి, నిర్వహణ లోపం అంతటా కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. డస్ట్‌బిన్‌లు లేక తిన్న విస్తర్లని సెంటర్లలోనో, రోడ్ల మీదో పడేస్తున్న సంఘటనలున్నాయి. పారిశుద్ధ్యలోపం ఒక ప్రధాన సమస్యగా ఉంది.
 
చిరునామా కరువైన శుభ్రత, నాణ్యత 
మెజారిటీ ఇందిరమ్మ క్యాంటీన్లు పరిశుభ్రతకు ఆమడ దూరంలో ఉన్నాయి. కాస్తో, కూస్తో నిలువదగ్గ పారిశుధ్ద్యం ఉన్న క్యాంటీన్లు నాలుగోవంతు కూడా ఉండవేమో! వడ్డించే వారే తప్ప ఒకరు తినిపోయిన తర్వాత ఆ పరిసరాల్ని శుభ్రపరిచే సిబ్బంది లేరు. కూర్చొని తినే వ్యవస్థ (దాతలు వ్యవస్థ సమకూర్చిన ‘హైటెక్‌సిటీ’ వంటి ఒకటి, రెండు చోట్ల తప్ప) ఎక్కడా లేదు. ఎక్కడి చెత్త అక్కడే రోజుల తరబడి ఉంటుంది. జీహెచఎంసి స్థానిక పారిశుద్ద్య సిబ్బంది దయతలిస్తే మూడు, నాలుగు రోజులకొకసారే క్లీనింగ్! కంటెయినర్‌లో ఏర్పరచిన ఆర్వో వాటర్ పాయింట్లు పనిచేయవు, ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోయినా బాగు చేసే వ్యవస్థ లేదు. కొన్ని చోట్ల కంటెయినర్లు వచ్చి ఉన్నా, వాటిని వాడకుండా పాత డబ్బాలలోనే సెంటర్ నిర్వహిస్తున్నారు. క్యాంటీన్‌కు ఆనుకొనే చెత్త డంప్‌లు, అతి సమీపంలోనే పబ్లిక్ యూరినల్స్ (అనాథరైజ్డ్) ఉన్నాయి.కోవిడ్ తర్వాత జనాల్లో ఆరోగ్య విషయంలో అవ‌గాహ‌న‌ పెరిగింది. ఆహారం, పంపిణీ, ప్రాంగణం, పరిసరాలు....వీటన్నింటిలోనూ పరిశుభ్రత లోపించడం వల్ల తెలిసినవారు కూడా అటు వెల్లడానికి ఇష్టం చూపటం లేదు.
 
ఇక ఇందిరమ్మ క్యాంటిన్లలో అందిస్తున్న ఆహార నాణ్యత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భోజనంలో అన్నంతో పాటు ఒక కర్రి, సాంబారు/రసం గానీ,  పప్పు సాంబారు/రసం గానీ ఇవ్వాలి. అడిగిన వారికి ఏదో ఒక చట్నీ ఇవ్వాలి. అది కూడా చాలా సార్లు ‘అయిపోయింది’ అనే చెబుతారు. నీళ్ల కోసం ఆర్వో సెంటర్లు ఏర్పాటు చేసినా అవి ప్రారంభించకపోవడంతో నీళ్ల పాకెట్లే కొనసాగుతున్నాయి. అవి కూడా సరిగా ఉండవు. పగిలిన ప్యాకెట్లు కూడా వస్తాయి, మరోమారు నీరు వాసన వస్తుంటుంది. నీళ్లు బాగోవు, సరిపడా ఇవ్వరని 79 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. అన్నం ముద్దలాగా ఉంటోందని, మంచి బియ్యం వాడట్లేదనే ఆరోపణ ఉంది. అనేక చోట్ల సన్నబియ్యాన్ని ప్రభుత్వం హెచ్‌కెఎం సంస్థకు అందించి ఆ బియ్యంతో అన్నం వండించి పంపిణీ చేయాలని కూడా అధికాశాతం మంది అభిప్రాయపడ్డారు. కర్రీ, సాంబర్ కూడా నీళ్లలాగా పలుచగా ఉంటోందని, ఒకోసారి రెండూ ఒక్కలాగే ఉండటమో, కలిపి అన్నంలో పోయడమో చేస్తున్నారని తినే వారంటున్నారు. దానికి బదులు సాంబారు రైస్, కర్డ్‌రైస్, పులిహోరా, టామోటా రైస్, పుదీనా రైస్, జీరారైస్, వెజ్‌టెబుల్ బిర్యానీ....ఇలా ఏదో ఒకటిచ్చినా బాగుండు అని అత్యధికులు అంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇదే మాదిరిగా అందిస్తున్నారని అదేవిధంగా ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందని అధికశాతం మంది ప్రజలు తెలిపారు.  అలా ప్రత్యేక అన్నం ఒకటే ఇచ్చి, దాని అంచుకు చట్నీ ఇస్తే చాలన్నది వారి అభిప్రాయం. పేరుకు అన్నం, కర్రి, పప్పు, సాంబారు.... అన్నట్టుగా ఇస్తున్నా ఆహారం ఏ మాత్రం రుచి ఉండదు. ఆహారం రుచిగా ఉండటం లేదు అన్నవారు 70 శాతం మంది ఉన్నారు. 
 
రుచికోసమే కాకుండా ఆరోగ్య రీత్యా కూడా ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అనేది సామెత. కానీ, హెచ్‌కెఎం వారు తమ పద్దతి ప్రకారం వంటకాల్లో ఉల్లిపాయలు వాడరు. ఉప్పు, కారం కూడా సరిపోయినంత వాడరనేది తినేవారి అభిప్రాయం. ఆహారంలో సరైన పోషకాలు ఉన్నాయా? అసలు అందులో ఏది ఎంతమేర 
ఉండాలి? ఆ సంగతే ఎవరికీ పట్టదు. తగిన పోషక విలువలు లేని ఆహారం వల్ల ఉపయోగం లేదు. పోషకాల విషయంలో దానికో లెక్కే లేదు. ‘భారత ఆహార భద్రత`ప్రమాణాల ప్రాధికార సంస్థ`ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ’ వారి ప్రమాణాలకు దరిదాపుల్లోనూ ఉండదు. ఎప్పుడూ ఆహారం వేడిగా అందించరు. వేడిగానే అందిస్తారని 5శాతం మంది చెబితే, అప్పుడప్పుడు వేడిగా ఉంటుందని 12 శాతం మంది, వేడి ఆహారం చాలా అరుదని 83 శాతం మంది చెప్పారు, కొన్ని చోట్ల బ్రేక్‌ఫాస్ట్‌-లంచ్ రెండూ ఒకేసారి తెచ్చి సెంటర్లో పెడుతున్నారు. ఫలితంగా బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యమౌతోంది, లంచ్ ముందుగానే అందించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. 
 
బ్రేక్‌ఫాస్ట్ పరిమాణంలో సిబ్బంది ‘చేతివాటం’ కూడా ఉంటోంది. మూడుకు బదులు రెండే ఇడ్లీలు ఇస్తున్నారు. చాలా చోట్ల బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యమవుతున్న సందర్భాలున్నాయి. ఆలస్యం గురించి ఫిర్యాదు చేసిన వారిలో, సగటున 10 నిమిషాలు అలస్యంగా వస్తోందని 70 శాతం మంది చెబితే, 10 నుంచి 30 నిమిషాలు ఆలస్యమవుతోందన్న వారు 30 శాతం మంది ఉన్నారు. అది కూడా నాణ్యంగా ఉండదు. ఉప్మా నీళ్లలా పలుచగా ఉండటంతో తినడం కాకుండా ఉప్మాని తాగాల్సివస్తోందని కొందరు వినియోగదారులు వాపోయారు. ఇడ్లీలు గట్టిగా రాళ్లలా, చట్నీ పుల్లగా, బోండాం నూనేలో ముంచి తేల్చినట్టు.... ఇలా రకరకాలుగా విమర్శలున్నాయి. ఇటు తినేవారి నుంచి, అటు ప్రభుత్వం నుంచి డబ్బు పొందుతూ కూడా అద్వాన్నమైన ఆహారం అందించడం ఎవరికీ మింగుడు పడటం లేదు. ఆస్పత్రుల‌ వద్ద, ఇంకా ఇతర చోట్ల ఇందిరమ్మ క్యాంటీన్లకు పక్కనే పలువురు వితరణశీలురు తమ దానధర్మాల్లో పెట్టే ఉచిత భోజనం, ఇచ్చే ఆహారపు ఐటమ్స్ ఎంతో నాణ్యతతో ఉంటాయనే వ్యాఖ్యలు వినిపించాయి. రూ.30 కి, పులిహోరానో, సాంబార్ రైసో, కర్డ్‌రైసో..... ఏదో రూపంలో అన్నం ఇంతకన్నా నాణ్యమైనది అందిస్తున్న ప్రయివేటు ఫుడ్‌పాయింట్ రోడ్ల పక్కన చాలానే ఉన్నాయనేది వారి అభిప్రాయంగా ఉంది. 
 
సర్కారిచ్చే డబ్బు గురించి తెలియట్లేదు 
అయిదు రూపాయల భోజనం నిజానికి అయిదు రూపాయలది కాదు. ప్రతి భోజనానికి, తినే వాళ్లు తమ జేబు నుంచి 5 రూపాయలిస్తుంటే, దానికి ప్రభుత్వం మరో రూ 24.83 సబ్సిడీ చెల్లిస్తోంది. అంటే, ప్రతి మీల్‌కు రూ.29.83 (దాదాపు ముఫ్ఫై రూపాయలు) ఖర్చవుతోంది. టిఫిన్ విషయంలోనూ అంతే! తినే వాళ్లు రూ.5 చెల్లిస్తుంటే ప్రభుత్వం దానికి మరో రూ.14 సబ్సిడీగా చెల్లిస్తోంది. అంటే, ఒక్క టిఫిన్‌కు రూ.19 వ్యయమవుతున్నట్టు లెక్క. బయట ఇరవై రూపాయలకు మంచి రుచికరమైన టిఫిన్ పెట్టేవాళ్లున్నారు.
 
హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల బండ్ల మీద, టివిఎస్,  సైకిళ్లపైన వచ్చి రోడ్డుపక్కన టిఫిన్లు అందించే వారు రకరకాల ఐటమ్స్ రూ. 20 కే ఇస్తున్న సందర్భాలు బోలెడుంటున్నాయి. కానీ, ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇచ్చే ఆహారం రుచి మాత్రమే కాదు, ఏ ప్రమాణాలతో చూసినా నాణ్యతే ఉండట్లేదు. భోజనంతో పోల్చి చూస్తే ‘టిఫిన్ కాస్త నయం’ అనే మాట ఒకటుంది. అందులోనూ, రాగి ఇడ్లీ, రాగి ఉప్మా, మిల్లెట్ టిఫిన్ అని చెప్పారు. మెనూలోనూ పేర్కొన్నారు. కానీ, ఎక్కడా అవి ఇవ్వట్లేదు.మెనూను పాటించడమే లేదు. ఏ రోజు, ఏ ఐటమ్ వస్తుందో డబ్బాలు ఇప్పి చూస్తే కాని తెలియదు.వచ్చింది తినాల్సిందే! పూరి ఉన్నపుడు కాస్త ఎక్కువ మంది తింటున్నారు. ఆ తర్వాత బోండాన్ని, అటుపైన పొంగల్ ను ఇష్టపడుతున్నారు. కొంతమంది తగినంత డబ్బు చెల్లించి టిఫిన్లను బాక్స్‌ల్లో తీసుకుపోతున్నారు. 
 
ఇందిరమ్మ క్యాంటీన్లలో భోజనం విషయంలో ‘బగారా రైస్‌’ ఉండే గురువారం నాడు కొంచెం ఎక్కువ మంది వస్తుంటారు. కొందరు రూ. 5 ఇచ్చి అన్నం వరకు తీసుకుపోయి, బయట కర్రీలు కొనుక్కొని తిని సరిపెట్టుకుంటున్నారు. ‘అయిదు రూపాయలే ఎందుకు? కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకొని అయినా ఆహారం నాణ్యత పెంచండి, మంచి భోజనం పెట్టండి’ అని అత్యధికులు అడుగుతున్నారు. టిఫిన్ అయినా, భోజనమయినా.... ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణకు పెద్ద మొత్తంలోనే ప్రజాధనం వ్యయమౌతోంది. సర్కారు అధికారిక లెక్కల ప్రకారం చూసినా ఇప్పటివరకు ఈ పథకానికి రూ. 253.87 కోట్లు వ్యయమైంది. అన్ని సెంటర్లలో కలిసి, రోజూ సగటున 30 వేల మంది లంచ్ చేస్తున్నారని సర్కారు లెక్కలు. తాజా గణాంకాల ప్రకారం ఏటా రూ. 40 కోట్లు (సుమారుగా టిఫిన్‌కు 13 కోట్లు, లంచ్‌కు 27 కోట్లు) ఖర్చవుతోంది. ఇదంతా జీహెచ్ఎంసి భరిస్తోంది. సర్వేలో తేలిన ఆశ్చర్యకరమైన విషయమేమంటే, తింటున్న వారిలో 80 శాతం మందికి ప్రభుత్వం ప్రతి మీల్స్‌కి, టిఫిన్‌కి పెద్దమొత్తంలో సబ్సిడీ ఇస్తున్న సంగతే తెలియదు! తామిచ్చే అయిదు రూపాయలే లెక్క అన్న భావన వారిలో ఉంది.
 
నిఘా-నియంత్రణ నిల్, నిర్వహణ డల్ 
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ మొత్తం వ్యయాన్ని భరిస్తున్నప్పటికీ, వారికీ వ్యవస్థ నిర్వహణ మీద శ్రద్దే లేదు. నిఘాలు లేవు, నియంత్రణ లేదు, ఎటువంటి తనిఖీలు కూడా నిర్వహించడం లేదు. సచివాలయానికి, జీహెచఎమ్సీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ల తనిఖీకి కూడా ఏ ఒక్క అధికారీ వెళ్లరు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ప్రయివేటుహోటళ్లు, ఫుడ్ సెంటర్లలో ఆహారం నాణ్యత తనిఖీలు జరిపినట్టు అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి, మరి ఇందిరమ్మ క్యాంటీన్ల తనిఖీ ఎందుకు చేయరనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. జీహెచ్ ఎం సి వారు తనిఖీకే రారని 95 శాతం మంది చెప్పారు. ఆహారం వండి, సరఫరా చేస్తున్న ‘హెచ్‌కెఎం’ వాళ్లు అప్పుడప్పుడు క్యాంటీన్ల తనిఖీలకు వస్తున్నారు. కానీ, అదీ నామమాత్రమే! దాంతో, క్యాంటీన్ల నిర్వహణ అద్వాన్నంగా ఉంటోంది. సమయం పాలన ఎక్కడా ఉండదు. టిఫిన్ ఉదయం 7గం.ల నుంచి 9.30 గం.ల వరకు, లంచ్ మధ్యాహ్నం 12 గం.ల నుంచి 2.30 గం.ల మధ్య అందించాలి. కానీ, సమయపాలన నిల్! నాలుగో వంతు చోట్ల మాత్రమే ఈ సృహ ఉంటోంది తప్ప మిగతా చోట్ల ఎవరూ పట్టించుకోవడం లేదు. 
 
ఈ వ్యవస్థ నిర్వహణలో భాగంగా వారు నియమించిన కాంట్రాక్టర్లు గానీ, క్యాంటీన్లలో పనిచేసే సిబ్బందికి గానీ శిక్షణ లేదు. క్రమశిక్షణ లేదు. కొన్ని సెంటర్లలో వారి ప్రవర్తన గౌరవప్రదంగా ఉండదు. మరికొన్ని చోట్ల శుచి`శుభ్రత కూడా అంతంతే! యూనిఫామ్ నిబంధన లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారుంటున్నారు. ‘బట్టలు సరిగా ఉండవు, స్నానాలయినా చేస్తారో చేయరో? వాసన వస్తుంటుంది, ఆహారం పెట్టేప్పుడు నిమిషాలు కూడా వారి పక్కన నిలువలేకపోతాం’ అన్న ఒక నడివయస్కుని మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. భోజనాలు పెట్టేవాళ్లు కనీస శుభ్రత పాటించకపోవడంతో తినడానికి వచ్చేవాళ్లు ఎంతో ఇబ్బంది ఫీలవుతుంటారు. మహిళలు సిబ్బందిగా ఉన్న చోట కొంత నయం. పీపుల్స్‌పల్స్ సర్వే బృందం వెళ్లినపుడు, సదరు క్యాంటీన్ వాళ్లు మరో క్యాంటిన్ వాళ్లను అప్రమత్తం చేసిన సందర్భాల్లో వాళ్లు తమ పరిసరాలను క్లీన్‌గా ఉంచుకోవడానికి యత్నించేది. అప్పటికప్పుడు కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టేది. నిజంగా, బాధ్యులైన అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే అంతటా పరిస్థితులు తప్పనిసరిగా మెరుగయి ఉండేవని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. 
 
మ్యాన్‌పవర్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు సిబ్బంది ఒక్కరీతి జీతాలివ్వకపోవడం, అదీ సకాలంలో ఇవ్వకపోవడం వంటివి వారి పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. సిబ్బంది ఒక్కొక్కరికి నెలకు అయిదు వేలు, నాలుగు వేలు, మూడు వేల రూపాయలు, కొందరికి అమ్ముడుపోయే టిఫిన్, భోజనం యూనిట్లను బట్టి కమిషన్ రూపంలో ఇవ్వటం....ఏ లెక్కా-పత్రం లేకుండా జరుగుతోంది. ఆ కమిషన్ కూడా 2014 నుంచి స్థిరంగా ఉందని, పెంచనే లేదని వారు వాపోతున్నారు. గిట్టుబాటు కాని వాళ్లు, సకాలంలో జీతం పడని వారు, ఇతరులతో పోల్చి చూస్తే తమకు తక్కువ వస్తోందనుకునే వారు... క్యాంటీన్ సిబ్బందిలో అత్యధికులు ఇలా నిత్యం అసంతృప్తితో పనిచేస్తున్నారు. అలా వారు తమ విధులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఈ అసమానతల్ని, తప్పిదాల్ని దిద్దుబాటు చేసేవారే లేరు. దీనిపై పెక్కు ఆరోపణలున్నాయి. ఒక్కో క్యాంటీన్‌కి ఎంత ఫుడ్ వస్తోంది? ఎంత మంది వచ్చి తింటున్నారు? ఎంత మిగులుతోంది? వెనక్కి పంపితే ఆ లెక్కలు-ఖర్చులేంటి? ఎవరు భరిస్తారు? ఎంత తరుగుతో అదనపు ఆహారం అవసరమవుతోంది? వీటికి లెక్కలే లేవు. ఎవరూ లెడ్జర్స్ నిర్వహించరు. అసలు వారిని లెక్కలడిగే నాథుడే లేరు అన్నట్టుంది పరిస్థితి!
 
ఎవరికీ పట్టని వైనం, అందుకే ఈ దైన్యం      
‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న సామెత చందంగా, అయిదేసి రూపాయలకే టిఫిన్, భోజనం పెట్టే ఇందిరా క్యాంటీన్ల వ్యవస్థ సంపూర్ణ వైఫల్యంలో సంబంధీకులందరి పాత్రా ఉంది. పేదల సంక్షేమం కోసం ఉదాత్త లక్ష్యంతో సబ్సిడీ భోజన పథకం చేపట్టిన ప్రభుత్వం ఈ వ్యవస్థ నడుస్తున్న తీరు-తెన్నులపైన, సాధకబాధకాలపైనా సమీక్షలే జరుపటం లేదు. నివేదికలు లేవు. విధాన పత్రమే కాదు, సరైన నిర్వహణా రికార్డులు, లాగ్ బుక్స్ లేకున్నా యేటా నిధుల్ని మాత్రం విడుదల చేస్తోంది. 
 
తన బడ్జెట్ నుంచి నిధులు వెచ్చించే హైదరాబాద్ మహానగర పాలకసంస్థ ఈ వ్యవస్థ పనితీరుపైన ఎటువంటి నిఘా, నియంత్రణ, తనిఖీలు ఏవీ నిర్వహించకపోవడం ఒక పెద్ద లోపంగా కనిపిస్తోంది. వారి నెలవారీ సమావేశాల్లోనూ ఇది చర్చకు రాదు. జీహెచ్చెమ్సీ పారిశుద్ధ్య విభాగాన్ని క్యాంటిన్లతో అనుసంధానించి శుచి-శుభ్రత విషయంలో చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండీ వారు చేస్తున్నదీ లేదు.  
 
నగరంలోని ఆరాంగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లోని క్యాంటీన్ల వద్ద టిఫిన్ కో, భోజనానికో వచ్చిన వారు ఏపీలో ఇటువంటి వ్యవస్థతో ఇక్కడి పరిస్థితుల్ని పోల్చి చేసిన వ్యాఖ్యలు దారుణాల్ని ఎత్తిచూపుతాయి. “రెండు చోట్లా తాము తినిచూశామని, అక్కడి ‘అన్నా క్యాంటీన్లు’ ఇక్కడి ‘ఇందిరా క్యాంటీన్ల’ కన్నా వేయిరెట్లు నయమని వారు వ్యాఖ్యానించారు. క్యాంటీన్లు, నిర్వహణ, పరిసరాలు, పరిశుభ్రత, ఆహారం, నాణ్యత..... ఇలా ఏ అంశం పరంగా చూసినా అవి ఎన్నో రెట్లు గొప్పగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. సెంటర్ల ఏర్పాట్లలో, వాటిల్లో అందుబాటులో ఉంచే ఆహారం విషయంలో కూడా హేతుబద్దత లేదు. సిటీసెంట్రల్ లైబ్రరీ, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం వంటి నిరుద్యోగ యువత ప్రధానంగా వస్తుండే క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ సదుపాయం లేదు. తర్వాతయినా ఆలోచించి విస్తరించి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. 
 
ఈ మొత్తం ప్రక్రియలో సకాలంలో ఆహారం క్యాంటీన్లకు చేరుతుందా? ఆహారం వేడిగానే సర్వ్ చేస్తున్నారా?పరిమాణం సరిగా ఉంటుందా? లేదా? ఇవేవీ ఎవరికీ పట్టడం లేదు. జీహెచ్చెమ్సీయే కాకుండా ‘హెచ్‌కెఎం’ వారు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు, సిబ్బంది కూడా ఏదో అసంతృప్తితో కొంత, అలసత్వంతో కొంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటం సేవల వైఫల్యానికి కారణమవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొంచెం అటుఇటుగా ఇలాంటి సబ్సిడీ భోజన పథకాలు అమలవుతున్న చోట వారు స్థానిక డ్వాక్రా గ్రూపులో, అంగన్‌వాడీలకో, మహిళా సంఘాలవారికో అప్పగించి నిర్వహిస్తున్నారు. దాంతో నాణ్యత, నిర్వహణ మెరుగ్గా ఉన్నట్టు వార్తలున్నాయి. 
 
ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రజాధనంతో నడిచే ప్రజాయుత కార్యక్రమమే అయినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కార్పొరేటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. తమకు సంబంధమే లేని వ్యవహారంగా పరిగణిస్తున్నారు. ప్రారంభోత్సవానికి వచ్చినపుడు రిబ్బన్ కట్ చేసి, ఫోటోదిగి వెళ్లిపోవటం తప్ప ఒక ముద్ద ఆహారం తిన్నది కూడా లేదు. ఒకటి రెండు చోట్ల, ప్రారంభోత్సవమప్పుడు ‘ఇవాళ వచ్చిన వారందరికీ, మేం డబ్బులిస్తాం, మన భోజనం ఏర్పాటు చేయండ’ని చెప్పి తినిపించారే తప్ప ఆ డబ్బులు కూడా చెల్లించలేదనే విమర్శలున్నాయి. ఇదీ కొందరు స్థానిక నేతల పరిస్థితి!
 
బాగుచేస్తే తప్ప ప్రయోజనం లేదు 
పేదలకు నామమాత్రంగా 5 రూపాయలకే భోజనం పేరిట పెద్ద ఎత్తున ప్రజాధనం వ్యయమవుతోంది. ఇదంతా కాయకష్టం చేసే పన్ను చెల్లింపుదారుల నుంచి (ప్రత్యక్ష-పరోక్ష పద్దతుల్లో) వసూలు చేసిన సొమ్ము! కానీ, దానికి తగిన న్యాయం జరగటం లేదు. ఖర్చు చేస్తున్న స్థాయి ప్రయోజనం నెరవేరటం లేదు. నిర్వాహకుల్లో నిర్లక్షం తారాస్థాయిలో ఉంటే, తినేవారిలో సంతృప్తిస్థాయి అట్టడుగున ఉంది. ఒక నిర్దిష్ట విధాన పత్రమే లేకుండా మొదలైన ఈ పథకం, ఒకప్పుడు ‘అన్నపూర్ణ’ ఇప్పుడు ‘ఇందిరమ్మ’ పేరిట క్యాంటీన్లు నిర్వహిస్తున్న ఈ వ్యవస్థపై ఏ స్థాయిలోనూ సమీక్షలు జరుగవు. ప్రజాభిప్రాయ (తినే వారి మనోగతం) సేకరణ లేదు. దిద్దుబాటు చర్యలుండవు. పాలకుల దృష్టిపడదు. మీడియా చూపు ఆనదు. ప్రజాధనానికి ట్రస్టీలుగా ఉండాల్సిన ప్రభుత్వాలు తామే సంపూర్ణ యజమానులయినట్టు, ఇష్టానుసారం వ్యవహరించడమే తప్ప బాధ్యత`జవాబుదారితనంతో ఉన్నట్టు ఎక్కడా కనిపించదు. దాతలెవరైనా ముందుకొస్తే వారిచ్చే సొమ్ముతో ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచే ఆలోచన కూడా కనిపించదు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కింద కంపెనీలిచ్చే సొమ్ము సహకారంలో కొన్ని చోట్ల ఒకటి, రెండు రూపాయలకు కూడా ఇంతకన్నా మెరుగైన భోజనం అందిస్తున్న సంఘటనలున్నాయి. ఇక్కడ, ఇవేవీ పాలకులకు పట్టడం లేదు. ఇందిరమ్మ క్యాంటీన్ల వ్యవస్థ-పనితీరును ప్రత్యక్షంగా గమనించి, అక్కడి లోపాలు, వైఫల్యాలను పరిశీలించి, భాగస్వాములైన అందరితో మాట్లాడి, వారి నుంచి సేకరించిన అభిప్రాయాలు-సూచనల ప్రకారం ‘ఏం చేస్తే బాగుంటుంది?’ అనే కోణంలో పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ కొన్ని సిఫారసులు చేస్తోంది.
 
సిఫారసులు:
1. ‘ఇందిరమ్మ క్యాంటీన’ సబ్సిడీ భోజన పథకాన్ని సమూలంగా మారుస్తూ, ఒక విధాన పత్రం-నిర్దిష్ట విధివిధానాలు, పథకంలో భాగస్వాములయ్యే వారి విధులు-బాధ్యతల్ని నిర్దేశిస్తూ పున:ప్రారంభించడం మంచిది.
2. ఆహారం రుచి, నాణ్యత, పోషకాలు భారత ఆహార భద్రత`ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పౌష్ఠికాహార సంస్థ (ఎన్‌ఐఎన్) తో సంప్రదించి ఏ రోజు, ఏ పూట, ఏ రకమైన ఆహారం ఎంత పరిమాణంలో ఇవ్వాలో ‘మెనూ’ ఖరారు చేయాలి.
3. లక్షల రూపాయలు ఖర్చు చేసి రూపొందించిన ‘కంటెయినర్‌’లోని అన్ని సదుపాయాలు సవ్యంగా పనిచేసే విధంగా, తగు రిపేర్లతో వెంటనే చర్యలు తీసుకోవాలి. అవన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి. ప్రతి క్యాంటీన్ నిర్వహణను కంటెయినర్‌లోకి మార్చాలి. ప్రతి చోట సీసీ కెమెరాలుండాలి.  ఫిర్యాదు బాక్స్‌లు, టోల్‌ఫ్రీ నంబర్ స్పష్టంగా కనిపించే చోట ఏర్పాటు చేయాలి.
4. నగరంలో, శివారుల్లో (గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో) ని వివిధ చోట్ల క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సెంటర్లను పున:సమీక్ష చేసి, అవసరమైన, అందరికీ అనువైన చోట్ల వాటిని ఏర్పాటు చేసేలా చర్యలుండాలి.
5. ఆహారం తయారీ, పంపిణీ, క్యాంటీన్ల నిర్వహణను ముందు ప్రయోగాత్మకంగా (పాయ్లెట్ ప్రాజెక్ట్) కొన్ని చోట్ల ‘సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌’లకు ఇచ్చి, అవి విజయవంతం అవడాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించాలి.
6. క్యాంటీన్లలో శుచి-శుభ్రతను పెంచి, ప్రమాణీకరించాలి. అక్కడ సిబ్బందిని పెంచాలి. వారికి తగిన శిక్షణ, డ్రెస్‌కోడ్, కనీస వేతనాలు లభించేలా తగు చర్యలు తీసుకోవాలి.
7. ఇందిరమ్మ క్యాంటీన్ల ఆహారసలహా సంఘాన్ని ఏర్పాటు చేసి, నెలలో కనీసం రెండుసార్లు (పక్షానికోమారైనా) సమీక్షా సమావేశం జరిపించాలి. ప్రతి సమావేశంలోనూ అంతకు ముందరి సమావేశ నిర్ణయాలపై చర్యల నివేదిక ఉండాలి. తక్కువ కాల వ్యవధితో నిరంతరం క్యాంటీన్‌ల తనిఖీలు ఉండేలా చూసుకోవాలి.
8. మంత్రుల నుంచి కార్పొరేటర్ల వరకు ప్రజాప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, స్వయంగా వారక్కడ టిఫిన్/భోజనం చేయాలి. వారి దృష్టికి వచ్చిన అంశాలను వెంటనే ఆహార సలహాసంఘంకు తెలియజేయాలి. అందు అనుగుణంగా తగు చర్యలకు సలహాసంఘం అవసరమైన సిఫారసులు అధికారులకు చేసి, అవి ఖచ్చితంగా అమలయ్యేట్టు చూడాలి.
9. పన్నెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ సబ్సిడీ భోజన పథకంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారితో సమగ్ర సమీక్ష జరిపించి, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. 
10. ‘ఆకలి’ లేని వ్యవస్థ కోసం, నిరుపేదలకు నామమాత్రపు ఖర్చు (రూ.5ల) కే టిఫిన్/భోజనం అందించే గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ పథకం మంచి-చెడులను, విజయ`వైఫల్యాలను, సాధకబాధకాలను సంపూర్ణంగా తెలుసుకొని, తగు సవరణలతో తిరిగి చేపట్టడానికి వీలుగా ఒక లోతైన, సమగ్రమైన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇందుకోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి.
 
--ఆర్.దిలీప్‌రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com