సినిమా రివ్యూ: ‘బైకర్’.!
- April 03, 2026
మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఈ మధ్య కాస్త జోరు తగ్గించిన సంగతి తెలిసిందే. అందుకు కారణం శర్వా నటించిన సినిమాలు ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోతున్నాయ్ కూడా ఈ మధ్య. అయితే, ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘బైకర్’ ఒకింత అంచనాలు క్రియేట్ చేసింది. ప్రచార చిత్రాలు పవర్ ఫుల్‌గా కట్ చేయడం.. ప్రమోషన్లు కూడా కాస్త గట్టిగా చేయడంతో ‘బైకర్’ ఆటోమెటిగ్గా ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అయితే, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ‘బైకర్’ అందుకుందో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్) మోటో క్రాస్ రేసర్. తన తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) కలను నిజం చేసేందుకు చాలా కష్టపడుతుంటాడు. ఆయన కూడా ఒకప్పుడు రేసరే. బుల్లెట్ సునీల్ అని పిలుస్తుంటారాయనను. అంత ఫేమస్ రేసింగ్‌లో. ఆయన కోచింగ్‌లోనే విక్కీ రేసింగ్‌లో ఛాంపియన్‌గా ఎదుగుతాడు. కొడుకును అంతర్జాతీయ స్థాయి రేసింగ్ పోటీల్లో విజేతగా చూడాలన్నదే సునీల్ కల. అందుకోసం ఓ ఇంటర్నేషనల్ స్పాన్సరింగ్ కంపెనీని కష్టపడి ఒప్పిస్తాడు. అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్‌లో రేసింగ్ నుంచి తప్పుకుంటాడు విక్కీ. అందుకు కారణం ఏంటీ.? చిన్నతనం నుంచీ తండ్రి కోరిక తీర్చాలనే కసితో పెరిగి, తన తండ్రే ప్రాణంగ బతికే విక్కీ, అనన్య (మాళవిక నాయర్) ప్రేమలో ఎలా పడతాడు.? ఆ ప్రేమ ఇంత ప్రాణంగా వున్న తండ్రీ కొడుకుల బంధంపై ఎలాంటి ప్రభావం చూపించింది.? చివరికి తండ్రి కలను విక్కీ నెరవేర్చగలిగాడా.? తెలియాలంటే ‘బైకర్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
రేసర్‌గా కనిపించేందుకు ఫిట్‌నెస్ పరంగా తనను తాను చాలా మార్చుకున్నాడు శర్వానంద్. అలాగే, ప్రొఫిషనల్ రేసర్‌గా కనిపించేందుకు తానెంతగా కష్టపడ్డాడో ఆ కష్టమంతా తెరపై సుస్పష్టంగా కనిపించింది. తండ్రి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. ఆయనకు డైలాగులు తక్కువే వున్నా.. వున్నంతలో ఆ పాత్రకు చాలా డిగ్నిటీ తీసుకొచ్చారాయన. హీరోయిన్‌గా మాళవిక నాయర్ బాగుంది. మరీ అంత స్కోపున్న పాత్ర అని చెప్పలేం. కానీ, తన పరిధి మేర అందంగా కనిపిస్తూ.. తన నేచురల్ టాలెంట్ చూపించింది. అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ తదితర నటీ నటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఇప్పటికే వెండితెరపై చాలా సినిమాలు చూశాం. కథ పరంగా ఆ ప్యాటర్న్‌కి ఈ సినిమా ఏమంత విభిన్నంగా వుండదు. కానీ, కథనం పరంగా ఒకింత కొత్తదనం చూపించే ప్రయత్నాలు చేశాడు దర్శకుడు. కానీ, అవి కూడా ఊహకు అందినట్లే అనిపిస్తాయ్. ఈ తరహా సినిమాల్లో ముఖ్యంగా భావోద్వేగాలు ముఖ్యమైనవి. ఆ భావోద్వేగాలు ఈ సినిమాలోనూ వున్నాయ్. కానీ, అవి కూడా ప్రేక్షకుడికి కొత్తగా అనిపించవ్. స్పోర్ట్స్ డ్రామాల్లో హీరో మొదటి నుంచీ ఓ ఆట పట్ల అత్యంత మక్కువతో వుండడం.. ఓ కారణంతో ఆ ఆటకు దూరం కావడం.. ఓ బలమైన మరో కారణంతో మళ్లీ ఆ ఆటకు దగ్గరై సివరాఖర్లో తాను అనుకున్నది సాధించడం ఈ తరహా సినిమాల కథల్లో చూస్తూనే వుంటాం. కానీ, కథనం నడుస్తున్న తీరులో అక్కడక్కడా తేడాలుంటాయ్ అంతే. అలాంటి చిన్న చిన్న తేడాల కోసం ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు కొన్ని చోట్ల గూస్ బంప్స్ తెప్పించేలా వుంటాయ్. ఆ సన్నివేశాలు ఖచ్చితంగా తెరపై చూసి తీరాల్సిందే. ఫస్టాఫ్ సో సోగా నడిపించేసినా.. దర్శకుడు అభిలాష్ రెడ్డి సెకండాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకుని వుంటే బావుండేది. ఎమోషనల్ సీన్లలో శర్వానంద్ టాప్ రేంజ్ వుండే సత్తా వున్న హీరో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఎందుకో ఈ సినిమాలో ఎమోషన్స్ అంతలా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. శర్వానంద్‌ని ఇంకా సరిగ్గా వాడలేదనిపిస్తుంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. రేసింగ్ సన్నివేశాలు నేచురల్‌గా అనిపిస్తాయ్. జిబ్రాన్ మ్యూజిక్ పాటలకైతే చాలా స్టైలిష్‌గా వుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. అనిల్ ఎడిటింగ్ ఓకే. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
శర్వానంద్ లుక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్, సెకండాఫ్, రేసింగ్ సన్నివేశాలు..
మైనస్ పాయింట్స్:
పాత కథే, వెరీ రొటన్ కథనం, ఆకట్టుకోని భావోద్వేగాలు ఎక్స్‌ట్రా
చివరిగా:
‘బైకర్’..ఆ రేస్‌కి ఈ స్పీడ్ సరిపోలేదేమో.!
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









