బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!

- April 03, 2026 , by Maagulf
బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!

ఢాకా: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన చమురు సంక్షోభం బంగ్లాదేశ్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఇంధన నిల్వలు నిండుకోవడంతో, ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠినమైన పొదుపు చర్యలను (Austerity Measures) అమలులోకి తెచ్చింది.

ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు, సహజ వాయువు సరఫరా నిలిచిపోవడంతో బంగ్లాదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం లేక దేశం అంధకారంలోకి వెళ్లకుండా ప్రభుత్వం ముందుగానే మేల్కొంది. దేశంలో విద్యుత్‌ వినియోగాన్ని పొదుపు చేసేందుకు ఆఫీసుల పనివేళల్లో మార్పులు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పని చేయాలని ఆదేశించింది. అలాగే బ్యాంకింగ్ సేవలు కూడా మధ్యాహ్నం 3 గంటలకే ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాదు వాణిజ్య వర్గాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది.

షాపింగ్ మాల్స్, మార్కెట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని రూల్స్ విధించింది. అత్యవసర సేవలైన వైద్యం, ఆహార విక్రయ కేంద్రాలను మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. ప్రజలపై మాత్రమే కాకుండా.. ప్రభుత్వ యంత్రాంగంపై కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధనం,  విద్యుత్ బడ్జెట్‌లో వెంటనే 30 శాతం కోత విధిస్తున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటన చేసింది. ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కొత్త వాహనాలు, విమానాలు లేదా నౌకల కొనుగోలుపై తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే బహిరంగ వేడుకల్లో అలంకరణ విద్యుత్ దీపాల వాడకూడదని చెప్పింది.

దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని తగ్గించుకోవడంతో పాటు.. అందుబాటులో ఉన్న వనరులను అత్యవసర సేవలకు మాత్రమే మళ్లించాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్ సంస్థల నుంచి 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోరుతోంది. అలాగే తక్షణ ఇంధన అవసరాల కోసం భారత్‌ వైపు చూస్తోంది. అయితే బంగ్లాదేశ్‌ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన భారత్.. ఇప్పటికే స్నేహపూర్వకంగా 5,000 టన్నుల అదనపు డీజిల్‌ను సరఫరా చేసింది. కేవలం బంగ్లాదేశ్ మాత్రమే కాక మాల్దీవులు, శ్రీలంక లాంటి దేశాలకు కూడా ఇంధన భద్రత కోసం భారత్ వైపు చూస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే దక్షిణాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత ప్రభావితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com