సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం

- April 12, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం

జుబైల్: సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య (SATS) మానవతా సేవలో మరోసారి ఆదర్శంగా నిలిచింది. కష్టాల్లో ఉన్న ఒక భారతీయుడికి అండగా నిలిచి, అతన్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చిన సంఘటన ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటోంది.

మార్చి 17న ఉదయం SATS ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్ కోలేటి కి అత్యవసర సమాచారం అందింది. విమానాశ్రయంలో ఒక వ్యక్తి — ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన  మహబూబ్ పీర్ షేక్ — తీవ్ర భయాందోళనలతో, ఆకలితో అలమటిస్తూ, అసహాయ స్థితిలో ఉన్నారని తెలిసింది.

ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే ప్రవీణ్ కోలేటి మరియు ఎన్.వి.బి. కిషోర్ అక్కడికి చేరుకుని, అతనికి ధైర్యం చెప్పి జుబైల్‌కు తీసుకువచ్చారు. తమ నివాసంలో ఆశ్రయం కల్పించి, ఆహారం, వైద్యం, వ్యక్తిగత పరిరక్షణ అందించారు.

తెలుసుకున్న వివరాల ప్రకారం, మహబూబ్ తొమ్మిది నెలల క్రితం కువైట్‌కు వెళ్లి, అక్కడి నుంచి సౌదీ సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళ్లబడి ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేయాల్సి వచ్చింది. ఆ పని చేయడానికి నిరాకరించడంతో అతని పై హింస జరగడం, ఆరోగ్య సమస్యలు ఎదురవడం జరిగింది. చివరకు అతను స్వదేశానికి వెళ్లాలని యజమానిని ఒప్పించి, కొంత మొత్తాన్ని చెల్లించి విముక్తి పొందాడు. అయితే యుద్ధ పరిస్థితుల కారణంగా అతని ప్రయాణం మధ్యలో నిలిచిపోయింది.

SATS సభ్యులు అతనికి అండగా నిలిచి, అతని లీగల్ స్థితిని పరిశీలించగా, అతని వీసా చెల్లుబాటు అవుతుందని, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇండియాకు వెళ్లవచ్చని తేలింది. వెంటనే టికెట్ బుకింగ్ కోసం సభ్యుల నుంచి సహాయం కోరగా, పలువురు దాతలు ముందుకు వచ్చారు.

శివరామకృష్ణ సిరిగిన,అమర్నాథ్ రెడ్డి సింగనమల,వెంకట కృష్ణస్వామి,సోహేబ్ తదితరులు ఆర్థిక సహాయం అందించగా, తరువాత సురేష్ రెడ్డి నల్లారి,అనిల్ కుమార్ రెడ్డి కల్లూరు కూడా తోడ్పడ్డారు. కింగ్‌డమ్ ట్రావెల్స్ తక్కువ ధరకు టికెట్ అందించింది.

మార్చి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు కిషోర్ మహబూబ్‌కు అన్ని విధాల సహాయం అందించగా,  ప్రవీణ్ కోలేటి మొత్తం ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. వీసా మరియు చట్టపరమైన ప్రక్రియలను మనోహర్ ప్రసాద్ సమర్థంగా నిర్వహించారు. పాపారావు, శ్రీనివాస్ గుబ్బాల  కూడా వెనుకనుండి బలమైన మద్దతు ఇచ్చారు.

చివరగా, అన్ని అడ్డంకులను అధిగమించి, మహబూబ్ పీర్ షేక్ సురక్షితంగా తన ఇంటికి చేరుకున్నాడు.

ఈ ఘటన మానవత్వం ఇంకా జీవించి ఉందని, ఐక్యతతో ఏ సమస్యనైనా అధిగమించవచ్చని మరోసారి నిరూపించింది.

సమాఖ్య అధ్యక్షుడు కోనేరు ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com