పాకిస్థాన్‌లో ఐఎస్ ఖొరసాన్ సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది
- August 08, 2016
పాకిస్థాన్‌లో ఐఎస్ ఖొరసాన్ సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. క్వెట్టాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ దాడిలో 93 మంది మృతి చెందారు. 120 మంది గాయపడ్డారు. తొలుత ఓ న్యాయవాదిని హత్య చేసిన ముష్కరులు, అనంతరం హత్యకు గురైన సహచరుడిని కడసారి చూసేందుకు వచ్చిన న్యాయవాదులపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. దాడిలో ఇద్దరు పాత్రికేయులూ మృతి చెందారు. బలూచిస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బిలాల్ అన్వర్ కాశీని కోర్టుకు వెళుతుండగా సోమవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్వెట్టా ప్రభుత్వాస్పతికి తరలించారు. అన్వర్ మృతదేహానికి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున న్యాయవాదులు ఆస్పత్రికి వచ్చారు. వీరంతా ఎమర్జెన్సీ వార్డు వద్ద ఉన్న సమయంలో ఓ దుండగుడు అక్కడకు చేరుకొని, కాల్పులు ప్రారంభించాడు. కొద్దిసేపటికే తనను తాను పేల్చేసుకొన్నాడు. ఆ సమయంలో అక్కడ 250 మందికిపైగా ఉన్నారు. పేలుడు కారణంగా ఆస్పత్రిలో భీతావహపరిస్థితి నెలకొంది. మాంసం ముద్దలు, శరీరం నుంచి వేరుపడిన అవయవాలతో ఆస్పత్రి ప్రాంగణం నిండిపోయింది. క్షతగాత్రుల రోదనలతో ఆస్పత్రిలో విషాదచ్ఛాయలు నెలకొన్నాయి. దాడికి సూసైడ్ బాంబర్ 8 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించినట్లు భద్రతాధికారులు గుర్తించారు. ఈ ఏడాది మార్చిలో లాహోర్ పార్కులో జరిగిన ఆత్మాహుతి దాడి అనంతరం పాకిస్థాన్‌లో జరిగిన రెండో అతిపెద్ద బాంబుదాడి ఇది. లాహోర్ ఘటనలో 75 మంది మృతి చెందారు. పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధానమంత్రి నవాజ్ షరీ్‌ఫలు క్వెట్టా దాడిని తీవ్రంగా ఖండించారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ అఫ్ఘానిస్థాన్-పాక్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ తాలిబన్ ఉగ్రవాల ప్రభావం ఎక్కువ. ఇటీవల కాలంలో ఇక్కడ ఐఎ్‌స-ఖొరసాన్ తన పట్టును బిగిస్తోంది. కాసేపు చెవులు పనిచేయలేదు.. 'మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి చెవులు చిల్లులు పడేలా భారీ విస్ఫోటనం సంభవించింది. కొద్దిసేపటి వరకు చెవులు పనిచేయలేదు. పేలుడు అనంతరం ఆ ప్రాంతంలో ఎటుచూసినా నల్లకోటుతో ఉన్న న్యాయవాదుల మృతదేహాలే కనిపించాయి. ఎటుచూసినా మాంసం ముద్దలే' అని ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ఓ పాత్రికేయుడు వివరించారు. అన్వర్ మృతదేహాన్ని సందర్శించేందుకు ఆస్పత్రికి వచ్చిన న్యాయవాది పర్వేజ్ మాసీ ఆత్మాహుతి దాడి నుంచి త్రుటిలో తప్పించుకొన్నారు. ఆయన శరీరంలోకి గాజు పెంకులు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. 'పేలుడుకు ముందు కాల్పులు వినపడ్డాయి. దీంతో బయటకు పరుగుపెట్టాను. గాజు పెంకులు శరీరంలోకి దూసుకెళ్లడంతో స్పృహతప్పాను' అని పర్వేజ్ వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







