యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు
- June 09, 2026
అబుదాబి: యూఏఈలో ఉద్యోగాల కోసం వెళ్లిన ఐదుగురు స్నేహితుల జీవితాలను ఒక లాటరీ టికెట్ ఒక్కసారిగా మార్చేసింది. యూఏఈ లాటరీ నిర్వహించిన ‘లక్కీ డే’ డ్రాలో 30 మిలియన్ దిర్హమ్‌లు (సుమారు రూ.78 కోట్లు) గెలుచుకుని వారు కోటీశ్వరులయ్యారు. ఈ భారీ బహుమతిని ఐదుగురు సమానంగా పంచుకోనుండగా, ఒక్కొక్కరికి 60 లక్షల దిర్హమ్‌లు (సుమారు రూ.15.6 కోట్లు) అందనున్నాయి.
ఈ విజయంలో ప్రధాన పాత్రధారి నేపాల్‌కు చెందిన తయాబ్ ఖాన్ (26). ప్రస్తుతం అబుదాబి సమీపంలోని రువైస్ ఇండస్ట్రియల్ ఏరియాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆయన, తన నలుగురు స్నేహితులతో కలిసి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ వచ్చారు.
ఫేస్‌బుక్‌లో చూసి మొదలైన అదృష్ట ప్రయాణం
నాలుగేళ్ల క్రితం మెరుగైన ఉపాధి అవకాశాల కోసం నేపాల్ నుంచి యూఏఈకి వచ్చిన తయాబ్ ఖాన్, 2024 ప్రారంభంలో ఫేస్‌బుక్‌లో యూఏఈ లాటరీ గురించి తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తన స్నేహితులతో పంచుకోవడంతో అందరూ కలిసి టికెట్లు కొనాలని నిర్ణయించారు.
ప్రతి వారం ఒక్కొక్కరు మారుతూ నంబర్లను ఎంపిక చేసేవారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల జన్మతేదీలను, మరికొన్నిసార్లు యాదృచ్ఛిక సంఖ్యలను ఎంచుకునేవారు. ప్రారంభంలో చిన్న చిన్న బహుమతులు మాత్రమే దక్కినా, అదే వారికి మరింత నమ్మకాన్ని కలిగించింది.
“ఎప్పుడో ఒకరోజు పెద్ద బహుమతి వస్తుందనే ఆశతో మేము ప్రయత్నం కొనసాగించాం. ఆశను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు,” అని ఖాన్ తెలిపారు.
ఇమెయిల్ చూసి షాక్
లాటరీ ఫలితాలు ప్రకటించే సమయంలో ఖాన్ డ్రాను కూడా చూడలేదు. ఆయనకు వచ్చిన ఒక ఇమెయిల్ ద్వారా ఈ శుభవార్త తెలిసింది.
“ముందు కూడా చిన్న బహుమతులు గెలిచినప్పుడు ఇలాంటి మెయిల్స్ వచ్చేవి. అందుకే మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ మెయిల్ తెరిచి చూసేసరికి 3 కోట్ల దిర్హమ్‌లు అని కనిపించింది. నా చేతులు, కాళ్లు వణికిపోయాయి. ఇది నిజమేనా అనే అనుమానం కలిగింది,” అని ఆయన గుర్తుచేసుకున్నారు.
తర్వాత తన లాటరీ ఖాతాలో లాగిన్ అయి ఫలితాన్ని స్వయంగా ధృవీకరించుకున్నానని చెప్పారు.
ముందుగా స్నేహితులకు, తర్వాత మామయ్యకు సమాచారం
విజయం గురించి తెలుసుకున్న వెంటనే తనతో టికెట్ పంచుకున్న నలుగురు స్నేహితులకు ఖాన్ సమాచారం ఇచ్చారు. అనంతరం నేపాల్‌లో ఉన్న తన మామయ్యకు ఫోన్ చేశారు.
“నా జీవితంలో తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయనే. యూఏఈకి రావడానికి కూడా ఆయనే సహాయం చేశారు. నేను 3 కోట్ల దిర్హమ్‌లు గెలిచానని చెప్పగానే ఆయన మాటలు రావడం మానేశారు. కళ్లలో నీళ్లు తిరిగాయి,” అని ఖాన్ చెప్పారు.
ఎన్నో కలలు నిజం కానున్నాయి
ఈ జాక్‌పాట్ వల్ల తన స్నేహితుల జీవితాలు కూడా మారబోతున్నాయని ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. వారిలో ఒకరు ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా జీవిస్తుండగా, మరొకరు ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఇంకొకరు తాజాగా తండ్రయ్యారు.
“ఇప్పుడు వాళ్లు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఇది మా అందరి విజయం,” అని అన్నారు.
మొదటి లక్ష్యం..నేపాల్‌లో ఇల్లు
తనకు వచ్చిన డబ్బుతో ముందుగా నేపాల్‌లో కుటుంబం కోసం మంచి ఇల్లు నిర్మించాలనేది తన కల అని ఖాన్ తెలిపారు.
“ఇప్పటి వరకు ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు కుటుంబానికి అన్ని సౌకర్యాలతో కూడిన మంచి ఇంటిని నిర్మించగలను,” అని చెప్పారు.
అలాగే భవిష్యత్తులో వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. దుబాయ్‌లో ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
కలల కారు, రోలెక్స్ వాచ్
దీర్ఘకాలిక పెట్టుబడులతో పాటు తనకు ఎంతో ఇష్టమైన మహీంద్రా థార్ కారు మరియు రోలెక్స్ వాచ్ కొనుగోలు చేయాలనే కోరిక కూడా ఉందని ఖాన్ పేర్కొన్నారు.
ప్రేయసి స్పందన
యూఏఈకి రాకముందు నుంచే తనతో ఉన్న ప్రేయసి ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిందని ఖాన్ చెప్పారు.
“నా కష్టాలు, పోరాటం అన్నీ ఆమె చూసింది. నేను గెలిచానని చెప్పినప్పుడు మొదట నమ్మలేదు. గెలిచిన టికెట్ చూపించిన తర్వాత ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది,” అని తెలిపారు.
ఏళ్ల తరబడి ఆశతో కలిసి లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన ఐదుగురు స్నేహితుల పట్టుదల చివరకు ఫలించి, వారి జీవితాలను కోటీశ్వరుల జీవితాలుగా మార్చింది.
తాజా వార్తలు
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









