ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- June 19, 2026
జరిమానాలు లేకుండా వీసా స్థితి మార్చుకునేందుకు లేదా దేశం విడిచివెళ్లేందుకు అవకాశం
అబుదాబి: ప్రాంతీయ అసాధారణ పరిస్థితుల కారణంగా యూఏఈ నుంచి సమయానికి వెళ్లలేక ఓవర్‌స్టే అయిన ప్రయాణికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మరో కీలక ఉపశమనం ప్రకటించింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) ప్రభావిత వ్యక్తులకు 30 రోజుల ప్రత్యేక గడువును మంజూరు చేసింది.
ఈ గడువు జూన్ 10 నుంచి జూలై 9, 2026 వరకు అమల్లో ఉంటుంది. గతంలో ప్రాంతీయ పరిస్థితులు, గగనతల మూసివేతలు, విమాన సర్వీసుల రద్దు కారణంగా యూఏఈ విడిచి వెళ్లలేకపోయిన వారికి ఓవర్‌స్టే జరిమానాల నుంచి మినహాయింపు కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యక్తులు తమ వీసా లేదా నివాస హోదాను చట్టబద్ధంగా సరిచేసుకోవడానికి లేదా జరిమానాలు లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు ఈ అవకాశం కల్పించారు.
ICP విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుతం ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నందున గతంలో ఇచ్చిన జరిమానా మినహాయింపుకు కారణమైన పరిస్థితులు ఇక లేవని పేర్కొంది. దీంతో ప్రభావిత వ్యక్తులు తమ చట్టపరమైన హోదాను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ 30 రోజుల గడువు ఇవ్వబడిందని వెల్లడించింది.
యూఏఈలోనే కొనసాగాలని భావించే వారు ఈ గడువు సమయంలో తమ నివాస లేదా ఉద్యోగ వీసా స్థితిని మార్చుకోవచ్చు. దేశం విడిచి వెళ్లాలనుకునే వారు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల ప్రకారం నేరుగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక సౌకర్యం పొందేందుకు ఎలాంటి అదనపు ముందస్తు ప్రక్రియ అవసరం లేదని, సంబంధిత వ్యక్తులు అధికారిక మార్గదర్శకాలను అనుసరించాలని ఐసీపీ సూచించింది.
గత మార్చిలో ఫిబ్రవరి 28, 2026 నుంచి గగనతల పరిమితులు, విమానాల రద్దు కారణంగా యూఏఈ నుంచి వెళ్లలేకపోయిన విజిట్ వీసా హోల్డర్లు, ఎగ్జిట్ పర్మిట్ కలిగినవారు, వీసాలు రద్దైన నివాసితులకు ఓవర్‌స్టే జరిమానాల నుంచి మినహాయింపు ప్రకటించారు. తమ నియంత్రణలో లేని పరిస్థితుల వల్ల ఆర్థిక భారం పడకుండా వారిని రక్షించడమే ఆ నిర్ణయం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
ఈ తాజా నిర్ణయం ద్వారా ప్రభావిత వ్యక్తులు చట్టబద్ధంగా తమ భవిష్యత్ ప్రయాణాలు, నివాస ఏర్పాట్లు చేసుకునేందుకు మరింత అవకాశం లభించనుంది.
తాజా వార్తలు
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు







