ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు

- June 22, 2026 , by Maagulf
ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు

దోహా: ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన భారీ పేలుడులో 54 మంది గాయపడగా, మరో 18 మంది గల్లంతైనట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అధికారుల వివరాల ప్రకారం, సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు అనంతరం భారీ అగ్నిప్రమాదం సంభవించగా, అత్యవసర బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం గల్లంతైన 18 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఖతార్ ఎనర్జీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని బర్జాన్ స్థానిక గ్యాస్ సరఫరా కేంద్రం కార్యకలాపాలను పునఃప్రారంభించే సమయంలో పేలుడు సంభవించి అగ్ని చెలరేగింది.

ఈ ఘటనపై స్పందించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇది ఫ్యాక్టరీలో జరిగిన అంతర్గత పేలుడు అని పేర్కొంది. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేసింది.

అయితే ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రమాదకర గ్యాస్ లీకేజీ లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే రసాయనాల విడుదల జరగలేదని అధికారులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ప్రమాదానికి గల పూర్తి కారణాల పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఖతార్ ప్రభుత్వం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com