సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- June 24, 2026
విజయవాడ: ఏపీ రాజకీయాల్లో కాకరేపిన సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సిట్ బృందం బుధవారం విజయవాడ 2వ ఏజేఎం కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రధానంగా సాయికృష్ణ మిస్సింగ్ ఘటనకు సంబంధించి పరిణామాలపై దర్యాప్తులో లభించిన ప్రాథమిక ఆధారాలను కోర్టు దృష్టికి సిట్ బృందం తీసుకెళ్లింది.
రిమాండ్ రిపోర్టు ప్రకారం.. సాయికృష్ణ పై గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడైంది. అలాగే మే1 నుంచి జూన్ 1వ తేదీ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది. మే6 నుంచి మే8 మధ్య కాలంలో ప్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ స్టేషన్ కు పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన సమయంలో సాయికృష్ణను గుర్తించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. మే6న టాస్క్‌పోర్స్ పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకొని కృష్ణలంక సీఐ నాగరాజుకు అప్పగించినట్లు సమాచారం. అయితే, అదుపులోకి తీసుకున్న అనంతరం సాయికృష్ణను న్యాయస్థానంలో ఎందుకు హాజరుపర్చలేదనే ప్రశ్నకు సీఐ నాగరాజు సరైన వివరణ ఇవ్వలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీ పుటేజ్ ఎందుకు తొలగించబడిందన్న అంశంపైనా స్పష్టమైన సమాధానం లభించలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాయికృష్ణ తల్లి చేసిన ఆరోపణల నేపథ్యంలో మృతదేహాన్ని దహనం చేశారా అనే ప్రశ్నలకూ సమాధానాలు రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల పాత్ర, ఆరోపణల నిజానిజాలపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. దర్యాప్తునకు సంబంధించి అవసరమైన సహకారం పూర్తిస్థాయిలో అందలేదని, కేసు వెనుక ఉన్న అన్ని కోణాలను వెలికితీయడానికి నిందితులను కస్టడీకి అప్పగించాలని అధికారులు కోర్టును కోరారు. కేసులో ఇంకా అనేక అంశాలపై లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది. ఈ వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. సాయికృష్ణను కస్టోడియల్ డెత్ చేశారని సిట్ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కోర్టు జులై 8వ తేదీ వరకు నాగరాజుకు రిమాండ్ విధించింది.దీంతో కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐ నాగరాజును సిట్ అధికారులు తరలించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్‌లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్‌లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







