సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు

- June 27, 2026 , by Maagulf
సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు, అలాగే అక్కడ నుంచి ఇతర దేశాలకు వచ్చే వారికి ఆ దేశ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. మనీలాండరింగ్‌ (అక్రమ డబ్బు రవాణా)ను అడ్డుకునే చర్యల్లో భాగంగా.. బంగారం, నగదు, విలువైన వస్తువుల రవాణాపై ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. గతంలో ఉన్న 60,000 సౌదీ రియాల్స్ పరిమితిని భారీగా తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

కొత్త లిమిట్ ఎంత? రూల్స్ ఏంటి?
సౌదీ అరేబియాకు చెందిన ‘జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ’ (ZATCA) ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇకపై ప్రయాణికులు తమ వెంట 40,000 సౌదీ రియాల్స్ (భారత కరెన్సీలో సుమారు రూ. 10 లక్షలు) అంతకంటే ఎక్కువ విలువైన కరెన్సీ, బంగారం, వెండి, విలువైన రత్నాలు లేదా ఆభరణాలను తీసుకెళ్తే కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం ఇవ్వాలి. దీనికి సంబంధించి ఒక రాతపూర్వక డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆ వస్తువులను కొనుగోలు చేసిన అసలు ఇన్‌వాయిస్‌లు (బిల్లులు) కూడా అధికారులకు చూపించడం తప్పనిసరి.

రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన శిక్షలు.. భారీ జరిమానాలు!

ఒకవేళ ప్రయాణికులు ఈ నియమాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

తాత్కాలిక జప్తు: విలువైన వస్తువుల వివరాలు వెల్లడించకపోతే, వాటిని అధికారులు 72 గంటల పాటు తమ ఆధీనంలో ఉంచుకుంటారు.
మొదటి తప్పుకు జరిమానా: మనీలాండరింగ్ ఉద్దేశం లేకుండా, తెలియక మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే.. పట్టుబడిన వస్తువుల మొత్తం విలువలో 10 శాతం నుండి 25 శాతం వరకు జరిమానా విధిస్తారు.
రెండోసారి దొరికితే: ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే ఆ ఫైన్ కాస్త 50 శాతానికి పెరుగుతుంది.
క్రిమినల్ కేసు: ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే స్మగ్లింగ్ లేదా నేరపూరిత చర్యల కోసం తరలిస్తున్నట్లు తేలితే.. సదరు ప్రయాణికుల కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగిస్తారు.

ఈ తాజా నిబంధనలు భారత్‌తో పాటు ఇతర దేశాలకు ప్రయాణించే ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కాబట్టి సౌదీ వెళ్లేవారు లేదా వచ్చే వారు తమ బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల ఒరిజినల్ బిల్లులను వెంట ఉంచుకోవడం మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com