ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- August 26, 2026
మస్కట్: కేరళకు చెందిన మలయాళీ ప్రవాసులు ఒమన్ వ్యాప్తంగా ఓనం వేడుకలకు సిద్ధమవుతున్నారు. కేరళ జ్ఞాపకాలతో వేలాది మంది ప్రవాసులు ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒమన్‌లోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక సంస్థలు, ఇండియన్ సోషల్ క్లబ్ శాఖలు, కమ్యూనిటీ సంఘాలు, వ్యాపార సంస్థలు ఓనం వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వినోద కార్యక్రమాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఓనం సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగ జరుపుకునేందుకు కేరళకు బయలుదేరుతున్నట్లు ఒమన్‌లో చాలాకాలంగా నివసిస్తున్న ప్రవాసి అశోక్ పీకే తెలిపారు. విదేశాల్లో జీవితంలో ఎక్కువ భాగం గడిపిన తర్వాత ఓనం సందర్భంగా స్వస్థలానికి వెళ్లడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని ఆయన తెలిపారు.
సాంప్రదాయ విందులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కుటుంబ సమ్మేళనాలతో ఓనం మలయాళీ సమాజానికి ఎంతో ప్రత్యేకమైన పండుగగా నిలుస్తోంది. ప్రవాసులకు ఈ పండుగ కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో పాటు చిన్ననాటి జ్ఞాపకాలు, సంప్రదాయాలను తిరిగి గుర్తుచేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ ఏడాది తిరువోణం ఆగస్టు 26న జరగనుంది. ఆగస్టు 16న అథంతో ప్రారంభమైన పది రోజుల ఓనం వేడుకలకు ప్రతి రోజుకూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కేరళ ప్రజలకు ఓనం కొత్త సంవత్సరం ప్రారంభానికి కూడా సంకేతంగా భావిస్తారు. దీనిని ‘కొల్లవర్షం’గా పిలుస్తారు.పది రోజుల వేడుకల్లో చివరి రోజైన తిరువోణం నాడు కుటుంబ సభ్యులు ఇళ్లలో సమావేశమై సంప్రదాయ ఓనం విందును ఆస్వాదించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
మార్కెట్లలో ఓనం సందడి
ఒమన్‌లోని హైపర్‌మార్కెట్లు, సూపర్‌మార్కెట్లలో ఓనం కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. సంప్రదాయ పూక్కలం ఏర్పాటు చేసేందుకు పూలను కొనుగోలు చేసేందుకు కుటుంబాలు పెద్ద సంఖ్యలో దుకాణాలకు వెళ్తున్నారు. అదేవిధంగా ఓనం సందర్భంగా ధరించే సంప్రదాయ దుస్తులు అయిన కసవు చీరలు, ముండు, కుర్తాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రవాస కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి.
ఓనం వేడుకలు కేవలం పండుగకే పరిమితం కాకుండా సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం, సుసంపన్నమైన సమాజం వంటి విలువలకు ప్రతీకగా భావిస్తారు. ప్రజల పట్ల పాలకుల బాధ్యత, సమాజంలో సమానత్వం వంటి అంశాలు ఓనం పురాణ కథనాల్లో ప్రాధాన్యం పొందాయి. హిందూ సంప్రదాయం ప్రకారం కేరళను పాలించిన మహాబలి రాజు ప్రజాదరణను చూసి దేవతలు అసూయ చెందారని, ఆయన పాలనకు ముగింపు పలికేందుకు విష్ణువు వామన అవతారం ఎత్తారని కథనం ప్రచారంలో ఉంది. వామనుడు మహాబలి నుంచి మూడు అడుగుల నేలను కోరగా, చివరకు మహాబలి తన సమస్త రాజ్యాన్ని సమర్పించినట్లు పురాణాలు చెబుతాయి. తనను పాతాళానికి పంపే ముందు ఏడాదికి ఒకసారి తన ప్రజలను చూసేందుకు అనుమతించాలని మహాబలి విష్ణువును కోరగా, ఆ వరం లభించిందని విశ్వసిస్తారు. మహాబలి తన ప్రజలను కలుసుకునేందుకు తిరిగి వచ్చే రోజుగా ఓనం పండుగను జరుపుకుంటారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







