దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..

- July 07, 2026 , by Maagulf
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..

దుబాయ్: భవిష్యత్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ దుబాయ్‌లో వాణిజ్య ఎయిర్ ట్యాక్సీ సేవల ప్రారంభానికి కీలక అడుగు పడింది. ప్రపంచంలోనే తొలి వెర్టిపోర్ట్ (Vertiport) అధికారిక నియంత్రణ అనుమతి (రెగ్యులేటరీ సర్టిఫికేషన్) పొందింది.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని వీడీఎక్స్ (VDX) వెర్టిపోర్ట్ నగరంలోని ఎయిర్ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది. సేవలు ప్రారంభమైన తర్వాత ఈ కేంద్రం ద్వారా ఏటా సుమారు 1.70 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఏడాది చివరి నాటికి దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నిర్మించిన 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని వెర్టిపోర్ట్‌లో రెండు టేకాఫ్, ల్యాండింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేశారు. ఈ వెర్టిపోర్ట్‌కు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA), స్కైపోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానాల నిర్వహణకు అనుమతి లభించింది.

ప్రస్తుతం దుబాయ్ మెరీనాలో మరో వెర్టిపోర్ట్ నిర్మాణం కొనసాగుతుండగా, దుబాయ్ మాల్ మరియు పామ్ జుమైరా ప్రాంతాల్లో కూడా కొత్త కేంద్రాల నిర్మాణ పనులు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) సహకారంతో జరుగుతున్నాయి.

వెర్టిపోర్ట్ మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, ఆపరేషన్ విధానాలు, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా సమగ్ర పరిశీలన అనంతరం ఈ సర్టిఫికేషన్ మంజూరైంది.

GCAA డైరెక్టర్ జనరల్ సైఫ్ అల్ సువైది మాట్లాడుతూ, ఈ సర్టిఫికేషన్ విమానయాన రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వినూత్న సాంకేతికతను ప్రోత్సహించడంలో యూఏఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

జీసీఏఏ ఏవియేషన్ సేఫ్టీ వ్యవహారాల అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అఖీల్ అల్ జరౌనీ మాట్లాడుతూ, ఈ విజయంతో ఆధునిక వైమానిక రవాణా రంగంలో యూఏఈ అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.

కాగా, యూఏఈలో ఎయిర్ ట్యాక్సీ సేవలను విస్తరించే దిశగా ఇప్పటికే అబుదాబిలో కూడా 10 వెర్టిపోర్ట్‌లతో కూడిన నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ బతీన్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయాలను ఈ నెట్‌వర్క్‌లో కీలక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com