ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!

- July 11, 2026 , by Maagulf
ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!

మస్కట్: ఒమాన్, భారత్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, లాజిస్టిక్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడంతో పాటు ప్రాంతీయ సముద్ర భద్రత, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న పరిణామాలపై ఇరు దేశాలు కీలకంగా చర్చించాయి. మస్కట్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను సమీక్షించిన మంత్రులు, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే మార్గాలపై చర్చించారు. వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడం, నాణ్యమైన పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలను సాధించాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు, సముద్ర రవాణాపై ప్రభావం చూపుతున్న తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వాటి వల్ల ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలు, గ్లోబల్ సప్లై చైన్‌పై పడుతున్న ప్రభావాలపై కూడా ఇరు దేశాల మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు.

ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాలతో చర్చలు, సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, ప్రాంతీయ దేశాల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో ఒమన్, భారత ప్రభుత్వాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com