వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- July 13, 2026
దుబాయ్: యూఏఈలో పాఠశాలల వేసవి సెలవుల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గి ప్రయాణ సమయం తగ్గింది. అయితే ఈ సౌలభ్యాన్ని కేవలం సెలవులకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా కొనసాగించే అవకాశం ఉందని రవాణా, ఉపాధి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పాఠశాలలు మూతపడటంతో రోజూ వేలాది స్కూల్ ట్రిప్‌లు రద్దవడం ట్రాఫిక్ తగ్గడానికి ప్రధాన కారణమైనప్పటికీ, ఆఫీసుల పనివేళల్లో మార్పులు, ఫ్లెక్సిబుల్ స్టార్ట్ టైమ్స్, పరిమిత వర్క్ ఫ్రం హోమ్, కార్‌పూలింగ్, స్కూల్ బస్సుల వినియోగం పెంపు వంటి చర్యలతో రద్దీ సమయాల్లో వాహనాల సంఖ్యను తగ్గించవచ్చని వారు సూచిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్య సమయానికి సంబంధించినదే
యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు ఆపరేటర్ ఎస్‌టీఎస్ గ్రూప్ (STS Group) సీఈఓ స్టీవ్ బర్నెల్ మాట్లాడుతూ.. ప్రతి వేసవిలో ఉదయం ట్రాఫిక్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెప్పారు. ట్రాఫిక్ సమస్య కేవలం వాహనాల సంఖ్య వల్ల కాకుండా, అందరూ ఒకేసారి రోడ్లపైకి రావడమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఆఫీసు సమయాలను వేర్వేరుగా నిర్ణయించడం, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అమలు చేయడం, స్కూల్ బస్సుల వినియోగాన్ని పెంచడం ద్వారా కొత్త రోడ్లు నిర్మించకుండానే ప్రస్తుతం ఉన్న రోడ్ల సామర్థ్యాన్ని మరింత సమర్థంగా వినియోగించవచ్చని తెలిపారు.
30 శాతం వరకు ట్రాఫిక్ తగ్గే అవకాశం
దుబాయ్ ప్రభుత్వం గతంలో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. రెండు గంటల ఫ్లెక్సిబుల్ ఆఫీస్ ప్రారంభ సమయంతో పాటు నెలకు నాలుగు నుంచి ఐదు రోజులు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేస్తే ఉదయం రద్దీ సమయంలో ప్రయాణ సమయం 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగుల్లో 20 శాతం మంది ఇంటి నుంచే పని చేస్తే, షేక్ జాయెద్ రోడ్డుపై ట్రాఫిక్ 9.8 శాతం, అల్ ఖైల్ రోడ్డుపై 8.4 శాతం తగ్గవచ్చని అధ్యయనాలు వెల్లడించాయి.
స్కూల్ బస్సులు పరిష్కారంలో కీలకం
రోడ్‌సేఫ్టీయూఏఈ (RoadSafetyUAE) వ్యవస్థాపకుడు థామస్ ఎడెల్‌మన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌కు స్కూల్ డ్రాప్‌లు, పిక్‌అప్‌లు ఒక కారణమే తప్ప అవే ప్రధాన కారణం కాదన్నారు. స్కూల్ బస్సుల వినియోగం పెరగడం, చట్టబద్ధమైన కార్‌పూలింగ్ విధానాలను ప్రోత్సహించడం వల్ల ట్రాఫిక్‌తో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని చెప్పారు.
ఆర్టీఏ అధ్యయనం ప్రకారం.. ఒక్క స్కూల్ బస్సు రోడ్లపై నుంచి దాదాపు 50 ప్రైవేట్ కార్లను తగ్గించగలదు. దీంతో విద్యార్థుల భద్రత కూడా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
దుబాయ్‌లో కొత్త ప్రయోగం
ఈ ఏడాది ప్రారంభంలో రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA), యాంగో గ్రూప్, అర్బన్ ఎక్స్‌ప్రెస్ కలిసి స్కూల్ ట్రాన్స్‌పోర్ట్ పూలింగ్ సేవను ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఒకే ప్రాంతంలో నివసిస్తూ సమీప పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను షేర్డ్ ఎస్‌యూవీల్లో తరలించే ఈ విధానం విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
ప్రతి రంగంలో సాధ్యం కాదు
టీఏఎస్‌సీ ఔట్‌సోర్సింగ్ (TASC Outsourcing) గ్రూప్ చైర్మన్ మహేశ్ షహదాద్‌పురి మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఫైనాన్స్, కన్సల్టింగ్, కార్పొరేట్ రంగాల్లో ఫ్లెక్సిబుల్ పనివేళలు, వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయడం సులభమని చెప్పారు. అయితే ఆరోగ్య సేవలు, తయారీ, హాస్పిటాలిటీ, రిటైల్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగులు ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉండటంతో పూర్తిస్థాయి రిమోట్ వర్క్ సాధ్యం కాదన్నారు. అయినప్పటికీ, షిఫ్ట్‌లను విభజించడం, పని సమయాల్లో సౌలభ్యం కల్పించడం వంటి చర్యల ద్వారా ట్రాఫిక్ ఒత్తిడిని గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







