తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు

- July 17, 2026 , by Maagulf
తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు

హైదరాబాద్: తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో లిక్కర్ ధరలను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక జీవో (GO) నేడో రేపో వెలువడే అవకాశం ఉంది.

మద్యం తయారీ వ్యయం పెరిగిపోయిందని, రేట్లు పెంచాలని లిక్కర్ కంపెనీలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ కంపెనీల ప్రతినిధులతో ఏకంగా 11 సార్లు చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ధరలను సుమారు 20 శాతం మేర పెంచేందుకు సర్కార్ పచ్చజెండా ఊపింది.

ఏ బ్రాండ్ల పై ఎంత పెరగనుంది?
చీప్ లిక్కర్ నుంచి మొదలుకొని ప్రీమియం, హయ్యర్ క్యాటగిరీ బ్రాండ్ల వరకు అన్నింటి ధరలూ పెరగనున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పెరిగే అంచనా ధరలు ఇలా ఉన్నాయి:

హయ్యర్ క్యాటగిరీ బ్రాండ్లు: ఫుల్ బాటిల్‌పై రూ. 120 వరకు పెరిగే ఛాన్స్.
ప్రీమియం బ్రాండ్లు: ఫుల్ బాటిల్‌పై రూ. 100 వరకు పెరిగే అవకాశం.
చీప్ లిక్కర్ బ్రాండ్లు: క్వార్టర్ లేదా బాటిల్‌పై రూ. 90 వరకు అదనపు భారం పడే వీలుంది.
ఈ ధరల పెంపు వల్ల మద్యం తయారీ కంపెనీల లాభాలతో పాటు, ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా ఆదాయం సమకూరనుంది.

మందుబాబులకు ఊరట.. కొత్తగా చిన్న బాటిళ్లు!
ధరల భారం ఒకవైపు ఆందోళనకు గురిచేస్తున్నా, ప్రయాణికులు మరియు తక్కువ పరిమాణంలో మద్యం సేవించే వారి కోసం ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పనుంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే తెలంగాణలోనూ 150 ML, 200 ML పరిమాణం గల కొత్త మద్యం బాటిళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వినియోగదారులకు తమకు నచ్చిన సైజుల్లో మద్యం కొనుగోలు చేసే వెసులుబాటు కలగనుంది.

కాగా, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు ధరల సవరణ జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో బీర్ల ధరలపై రూ.30 నుంచి రూ.50 వరకు పెంచగా, మే నెలలో లిక్కర్ ధరలను క్వార్టర్‌కు రూ.10, హాఫ్‌కు రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com