దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!

- July 22, 2026 , by Maagulf
దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!

దుబాయ్: యూఏఈలో భారతీయుల కోసం పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవలను ఆల్హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మళ్లీ ప్రారంభించడంతో దుబాయ్‌లోని బర్ దుబాయ్ యూడబ్ల్యూ మాల్ (UW Mall) కేంద్రం వద్ద భారీ సంఖ్యలో భారతీయులు బారులు తీశారు. బుధవారం ఉదయం 5.45 గంటలకే పలువురు కేంద్రం వద్దకు చేరుకుని తమ వంతు కోసం వేచి చూశారు.

శార్జాలో నివసిస్తున్న అదీపా తన తండ్రి క్యాన్సర్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో అత్యవసరంగా భారత్ వెళ్లాల్సి ఉందని తెలిపారు. అయితే ఆమె పాస్‌పోర్టు గడువు కేవలం ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో నివాస వీసా పునరుద్ధరణ తిరస్కరించారని చెప్పారు. దీంతో మంగళవారం భారత కాన్సులేట్ వద్ద గంటల తరబడి వేచి చూసినా పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు అపాయింట్‌మెంట్ దొరకలేదని ఆమె భర్త సలీమ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం భారత రాయబార కార్యాలయం ఆల్హింద్ ద్వారా సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే, వారి కుమారుడు వెంటనే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేశాడని, దీంతో ఎంతో ఊరట కలిగిందని వారు చెప్పారు.

నిమిషాల్లోనే 2వేల అపాయింట్‌మెంట్లు బుక్

సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే అన్ని కేంద్రాల్లో కలిపి దాదాపు 2,000 అపాయింట్‌మెంట్ స్లాట్లు బుక్ అయ్యాయని ఆల్హింద్ చైర్మన్, వ్యవస్థాపకుడు మొహమ్మద్ హారిస్ తెలిపారు. మొదటి వారంలో దరఖాస్తుదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇకపై ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు కొత్త అపాయింట్‌మెంట్ స్లాట్లు విడుదల చేస్తామని వెల్లడించారు.

30 నిమిషాల్లో సేవలు పూర్తి చేయడమే లక్ష్యం

ప్రీమియం సేవలు ఉండవని, ప్రతి ఒక్కరికీ సమానమైన సేవలు అందిస్తామని హారిస్ స్పష్టం చేశారు. కేంద్రానికి వచ్చిన వారు 30 నిమిషాల్లోనే తమ పని పూర్తి చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

75 కౌంటర్లతో అత్యాధునిక కేంద్రం

బుధవారం ఉదయం భారత కాన్సులేట్ అధికారులు బర్ దుబాయ్‌లోని ఆల్హింద్ కేంద్రాన్ని పరిశీలించారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 75 సేవా కౌంటర్లు ఉండగా, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత రాయబార కార్యాలయాలకు సేవలందించే అతిపెద్ద ఔట్‌సోర్సింగ్ కేంద్రాల్లో ఇది ఒకటిగా ఆల్హింద్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com