సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!

- July 25, 2026 , by Maagulf
సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!

మస్కట్: సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛతో పాటు ఆగ్నేయాసియా దేశాలతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టబడి ఉన్నట్లు ఒమన్ స్పష్టం చేసింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన  ఆగ్నేయాసియా స్నేహ, సహకార ఒప్పందం (TAC) 50వ వార్షికోత్సవ మంత్రుల సమావేశంలో ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ పేర్కొన్నారు.

ఆసియాన్ (ASEAN) దేశాలతో ఒమన్ సంబంధాలు మరింత బలపడుతున్నాయని, అంతర్జాతీయ చట్టాలు, పరస్పర గౌరవం, శాంతియుత సహకారం ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకమని ఆయన అన్నారు.వివాదాల పరిష్కారానికి సంభాషణే ప్రధాన మార్గమని పేర్కొన్న మంత్రి, శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే దౌత్య ప్రయత్నాలకు ఒమాన్ ఎప్పటికీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.


అంతర్జాతీయ నౌకాయాన మార్గాల భద్రతపై మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాలు ఎల్లప్పుడూ తెరిచి, సురక్షితంగా ఉండాలని, ప్రపంచ వాణిజ్యానికి, నౌకాయాన స్వేచ్ఛకు ఎలాంటి అంతరాయం కలగకూడదని ఆయన పేర్కొన్నారు.సముద్ర భద్రతకు ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (UNCLOS) కీలక ఆధారమని, దాని నిబంధనలను గౌరవించడం ద్వారా ప్రపంచ వాణిజ్యం, ఆహార భద్రత, ఇంధన భద్రతను పరిరక్షించవచ్చని వివరించారు.

అంతర్జాతీయ నౌకాయాన మార్గాలను వినియోగించే దేశాలు పరస్పర సహకారంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మలక్కా జలసంధి మరియు సింగపూర్ జలసంధిలో అమలవుతున్న సహకార విధానం ఇందుకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. చివరగా, ఆసియాన్ సభ్య దేశాలతో సముద్ర రంగంలో సహకారాన్ని మరింత విస్తరించి, సురక్షితమైన, స్థిరమైన సముద్ర భాగస్వామ్యాల అభివృద్ధికి ఒమన్ కట్టుబడి ఉంటుందని సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com