ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!

- August 01, 2026 , by Maagulf
ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!

మస్కట్: ఒమాన్‌లోని పర్యాటక, ఆతిథ్య రంగ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కస్టమర్ల నుంచి వసూలు చేసే 8 శాతం సర్వీస్ ఛార్జీని పూర్తిగా ఉద్యోగులకే నగదు రూపంలో పంపిణీ చేయాలని పర్యాటక వారసత్వ మంత్రిత్వ శాఖ (Ministry of Heritage and Tourism) ఆదేశాలు జారీ చేసింది. టూరిజం చట్టం అమలు నిబంధనలలోని ఆర్టికల్-29 ప్రకారం జారీ చేసిన ఈ సర్క్యులర్ జూలై 30నుంచి అమల్లోకి వచ్చింది. ఒమన్‌లోని అన్ని లైసెన్స్ పొందిన పర్యాటక, హాస్పిటాలిటీ సంస్థలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

నూతన మార్గదర్శకాల ప్రకారం.. హోటళ్లు, రిసార్టులు, ఇతర పర్యాటక సంస్థలు వినియోగదారులు చెల్లించే బిల్లుపై 8 శాతం సర్వీస్ ఛార్జీ వసూలు చేయాలి. ఈ మొత్తాన్ని సంస్థ ఆదాయంగా పరిగణించకూడదని, ఇతర అవసరాలకు వినియోగించకూడదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వసూలు చేసిన మొత్తం సర్వీస్ ఛార్జీని ప్రతి నెల ఉద్యోగులందరికీ నగదు రూపంలో పంపిణీ చేయాలని ఆదేశించింది. పంపిణీకి సంబంధించిన రికార్డులు, ఆర్థిక పత్రాలను సంస్థలు తప్పనిసరిగా భద్రపరచాలని సూచించింది.

అంతేకాకుండా, మొత్తం ఎంత సర్వీస్ ఛార్జీ వసూలు చేశారో, ఎంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ చేశారో, లబ్ధిదారుల వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి సంబంధిత ఆర్థిక పత్రాలతో పాటు మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టరేట్‌కు ప్రతిని సమర్పించాలని ఆదేశించింది. సర్వీస్ ఛార్జీల పంపిణీపై అధికారిక నియంత్రణ మార్గదర్శకాలు విడుదలయ్యే వరకు ఈ సర్క్యులర్ అమల్లో ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com