సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

- August 03, 2026 , by Maagulf
సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

సలాలా: ఒమన్‌లోని సలాలా విలాయత్‌లో 9వ ఒమన్-బహ్రెయిన్ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఒమన్-బహ్రెయిన్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్, ఒమన్‌లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఎనిమిది రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్‌లో ఇరు దేశాలకు చెందిన పలు చిన్న, మధ్య తరహా సంస్థలు (SMEs) పాల్గొంటున్నాయి. తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించేందుకు వ్యాపారవేత్తలకు ఈ వేదికను అందిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వ్యాపారవేత్తలు ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ రంగాల్లో తమ అనుభవాలను పరస్పరం పంచుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. 

ఒమన్, బహ్రెయిన్ దేశాల సాంస్కృతిక, హస్తకళా, వారసత్వ వైవిధ్యాన్ని ఈ ఎగ్జిబిషన్ ప్రతిబింబిస్తోంది. రెండు దేశాల ప్రత్యేక ఉత్పత్తులను సందర్శకులకు పరిచయం చేస్తూ భవిష్యత్ ఆర్థిక, పెట్టుబడి భాగస్వామ్యాలకు వేదికగా నిలుస్తుందని ఒమన్-బహ్రెయిన్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ చైర్‌పర్సన్ రుదైనా అమెర్ అల్ హజ్రీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ప్రదర్శన ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ ఎగ్జిబిషన్‌లో దాదాపు 30 చిన్న, మధ్య తరహా సంస్థలు పాల్గొంటున్నాయని, ఫ్యాషన్ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఒమన్ ఫ్రాంకిన్సెన్స్ (లుబాన్), ఒమన్ హల్వా, ఆభరణాలు, సంప్రదాయ హస్తకళా వస్తువులు, గృహోపకరణాలు వంటి విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఈ ప్రదర్శన రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను విస్తరించడంతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపారాల అభివృద్ధికి కీలక వేదికగా మారుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com