‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్

- August 05, 2026 , by Maagulf
‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ‘ఆధార్’ అప్‌డేట్ పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. తక్షణమే మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోకపోతే బ్యాంక్ ఖాతాలు బ్లాక్ లేదా నిలిపివేయబడతాయని బ్యాంకుల పేరిట నకిలీ మెసేజ్‌లను (SMS/WhatsApp) పంపుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ సైబర్ మోసాల పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. ఈ తరహా నకిలీ సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని, అపరిచిత వ్యక్తుల నుండి లేదా అనుమానాస్పద నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లపై ఏమాత్రం అప్రమత్తత సడలించవద్దని సూచించారు.

లింక్స్, నకిలీ ఏపీకే ఫైళ్ల పట్ల పోలీసుల హెచ్చరికలు
ఇలాంటి నకిలీ సందేశాల్లో ఇచ్చే అనుమానాస్పద లింక్‌లను (Links) క్లిక్ చేయడం వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఆ లింక్స్ ద్వారా ఫోన్లలో ఏపీకే (APK) ఫైల్స్ డౌన్‌లోడ్ అయ్యేలా చేసి, బాధితుల మొబైల్ ఫోన్లను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని తెలిపారు. బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఆధార్ సంబంధిత వివరాల సరిచూపు కోసం ఎల్లప్పుడూ బ్యాంకుల అధికారిక యాప్‌లను (Official Banking Apps) లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు ట్విట్టర్ (X) వేదికగా సూచించారు. ఎవరైనా ఈ సైబర్ మోసాల బారిన పడితే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com