మోదీ మాటలతో బలూచిస్థాన్ నేతల్లో ఆత్మస్థయిర్యం ..
- August 16, 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలతో బలూచిస్థాన్ నేతల్లో ఆత్మస్థయిర్యం పెరిగింది. ఒక్కో పార్టీ వారూ ముందుకొచ్చి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మరింత గట్టిగా మాట్లాడుతున్నారు. తాజాగా బలూచ్ నేషనలిస్ట్ మువ్మెంట్ (బీఎన్ఎం) స్పందిస్తూ మోదీకి తోడుగా అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా ముందుకు రావాలని కోరింది. బీఎన్ఎం చైర్మన్ ఖలీల్ బలూచ్ మాట్లాడుతూ పాకిస్థాన్ మత ఉగ్రవాదాన్ని విధానంగా అమలు చేస్తుండటం వల్ల ఫలితాలు తీవ్రంగా ఉంటాయని ప్రపంచం అర్థం చేసుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని అణచలేమని, అయితే సమర్థంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాకిస్థాన్ 68 ఏళ్ళ క్రితం బలూచిస్థాన్‌ను ఆక్రమించుకుందని, పాకిస్థాన్‌తో బలూచిస్థాన్ ఐదుసార్లు యుద్ధం చేసిందని చెప్పారు. ఈ 68 ఏళ్ళ కాలంలో బలూచిస్థాన్ ప్రజలపై మానవత్వానికి వ్యతిరేకంగా యుద్ధ నేరాలకు పాల్పడినందుకు పాకిస్థాన్‌ను జవాబుదారీ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా, యూరోపు దేశాలు కలిసి రావాలని కోరారు. బలూచిస్థాన్‌పై మోదీ వైఖరిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆక్రమిత బలూచిస్థాన్‌లో జాతి విధ్వంసానికి, యుద్ధ నేరాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ పట్ల అంతర్జాతీయ సమాజం ఉదాసీన వైఖరిని అవలంబించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మోదీ ప్రకటన సానుకూల పరిణామమని చెప్పారు. బలూచ్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు బ్రహుమ్డగ్ బుగ్టి ఓ వీడియో స్టేట్మెంట్ ద్వారా స్పందిస్తూ బలూచిస్థాన్‌పై ప్రకటన చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ ప్రభుత్వం, మీడియా, యావత్తు భారత జాతి బలూచిస్థాన్ కోసం గళమెత్తాలని కోరారు. అంతేకాకుండా బలూచ్ స్వాతంత్ర్యోద్యమం కోసం ఆచరణలో సహకరించాలన్నారు. కశ్మీరులో పాకిస్థాన్ విధ్వంసం సృష్టిస్తోందని, ముంబై, పఠాన్‌కోట్ వంటి దాడుల్లో పాకిస్థాన్ ప్రమేయం ఉందని అందరికీ స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. బలూచిస్థాన్ జాతీయవాద నేత నవాబ్ అక్బర్ బుగ్టి మనుమడే బ్రహుమ్డగ్ బుగ్టి. నవాబ్ బుగ్టిని పాకిస్థాన్ సైన్యం ఓ ఎన్కౌంటర్లో హతమార్చింది. భారతదేశ ప్రభుత్వం బలూచ్ ప్రజల గళాన్ని వినిపించడం తాత్కాలిక లేదా స్వల్ప కాలిక వ్యూహం కాకూడదన్నారు. అణచివేతకు గురవుతున్న బలూచ్ అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములకు నిజాయితీగా మద్దతిచ్చే భారతదేశ ప్రజల మనోగతంగా ఉండాలన్నారు. అది భారతదేశ విదేశాంగ విధానంలో ముఖ్యమైన భాగంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయన 70వ దశాబ్దంలో పాకిస్థానీల దారుణాల నుంచి బెంగాలీ ప్రజలను కాపాడాలని భారతదేశ ప్రభుత్వం దృఢ నిర్ణయం తీసుకున్న సంగతిని ప్రస్తావించారు. కశ్మీరీలకు స్వయంపాలన, స్వీయనిర్ణయాధికారం కావాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తోందని, అదే సమయంలో బలూచిస్థాన్ ప్రజల ఆకాంక్షలను అణచివేస్తోందని అన్నారు. ఇటువంటి చర్యలు పాకిస్థాన్ ద్వంద్వ నీతిని, ఈ ప్రాంతంలో శాంతిసుస్థిరతలను నాశనం చేయడానికి పాకిస్థాన్ కుట్రలను వెల్లడిస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







