ఖతార్, ఒమన్ మధ్య బలపడుతున్న స్నేహబంధం..
- August 09, 2026
దోహా: ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ ఆదివారం దోహాలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేయడం, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల ప్రస్తుత స్థితిని సమీక్షించిన నేతలు.. భవిష్యత్తులో సంబంధాలను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు.
చారిత్రక బంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం
ఖతార్ అమిరీ దివాన్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. దోహాకు చేరుకున్న సుల్తాన్ హైతమ్, ఆయన ప్రతినిధి బృందానికి షేక్ తమీమ్ ఘన స్వాగతం పలికారు. ఖతార్–ఒమన్ మధ్య ఉన్న బలమైన సంబంధాలను ప్రశంసించిన అమీర్.. ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహా కట్టుబడి ఉందని తెలిపారు.
సుల్తాన్ హైతమ్ కూడా ఖతార్ అందించిన ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచేందుకు ఒమన్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సోదర దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసి, వివిధ రంగాల్లో ఉమ్మడి సహకారానికి విస్తృత అవకాశాలను సృష్టించడమే చర్చల లక్ష్యమని తెలిపారు.
రక్షణ, వాణిజ్యం, ఇంధనం తదితర అంశాలపై చర్చ
ఇరువురు నేతల సమావేశంలో రక్షణ, వాణిజ్యం, ఇంధనం, విదేశాంగ విధానం, ప్రాంతీయ భద్రత తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరు దేశాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
ఖతార్ తరఫున ఉప ప్రధానమంత్రి, రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ, అమిరీ దివాన్ చీఫ్ అబ్దుల్లా బిన్ మహమ్మద్ అల్ ఖులైఫీ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఇంధన వ్యవహారాల సహాయ మంత్రి సాద్ బిన్ షెరీదా అల్ కాబీ, వాణిజ్య–పరిశ్రమల మంత్రి షేక్ ఫైసల్ బిన్ థానీ అల్ థానీ, రవాణా మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ థానీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖి పాల్గొన్నారు.
ఒమన్ తరఫున మస్కట్ గవర్నర్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతమ్ అల్ సయీద్, రాయల్ కోర్టు మంత్రి సయ్యద్ ఖాలిద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, రాయల్ ఆఫీస్ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ నుమానీ, అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ, ఇంధన–ఖనిజాల మంత్రి ఇంజినీర్ సలీమ్ బిన్ నాసర్ అల్ ఔఫీ తదితరులు హాజరయ్యారు.
సమావేశం అనంతరం సుల్తాన్ హైతమ్, ఆయన ప్రతినిధి బృందం గౌరవార్థం షేక్ తమీమ్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వం పై ఉమ్మడి దృష్టి
గత దశాబ్ద కాలంలో ఖతార్–ఒమన్ సంబంధాలు మరింత విస్తరించాయి. ఆర్థిక సహకారంతో పాటు విదేశాంగ విధానంలోనూ ఇరు దేశాల మధ్య సన్నిహిత సమన్వయం కొనసాగుతోంది. మధ్యప్రాచ్యంలో తలెత్తుతున్న సమస్యలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఇరు దేశాలు పదేపదే పిలుపునిస్తున్నాయి.
ప్రాంతీయ భద్రతా సవాళ్ల నేపథ్యంలో కూడా దోహా, మస్కట్ మధ్య సమన్వయం ఇటీవల మరింత పెరిగింది. గల్ఫ్, అరబ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరంపై ఇరు దేశాలు ఉమ్మడి వైఖరిని వ్యక్తం చేస్తున్నాయి.
గాజా యుద్ధానికి ముగింపు పలకాలని, ప్రాంతీయ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, తద్వారా మరింత ఘర్షణలకు తావులేకుండా ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని ఖతార్, ఒమన్ సంయుక్తంగా పిలుపునిచ్చాయి.
సుల్తాన్ హైతమ్ పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అమిరీ హాల్లో ఆయనకు వీడ్కోలు పలికేందుకు ఖతార్ అమీర్ షేక్ తమీమ్ స్వయంగా హాజరయ్యారు. తాజా భేటీతో గల్ఫ్ ప్రాంతంలోని ఇరు సోదర దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహబంధం, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
----రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్, ఒమన్ మధ్య బలపడుతున్న స్నేహబంధం..
- మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
- ‘దుబాయ్-ఇట్ అవార్డు’కు ఆగస్టు 10 నుంచి నామినేషన్లు
- బ్రహ్మోస్‌కు భారీ డిమాండ్..
- వరంగల్‌లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సీవీ ఆనంద్ భేటీ
- పిల్లల స్క్రీన్ టైమ్‌పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్‌లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







