రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!

- August 12, 2026 , by Maagulf
రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!

రియాద్: సౌదీ అరేబియాలో రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య నిబంధనలను నవీకరించడంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీలను ముమ్మరం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆహార సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వినియోగదారుల ఆరోగ్యం, ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ చర్యల్లో భాగంగా రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలు, ఆహార భద్రతా లోపాలను గుర్తించి రికార్డు చేసేందుకు పోర్టబుల్ కెమెరాలను వినియోగిస్తున్నారు.

సౌదీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మానిటరింగ్ వ్యవస్థలో మొబైల్ కెమెరాలను కీలక భాగంగా ఉపయోగిస్తోంది. తనిఖీల సమయంలో చేపట్టే కార్యకలాపాలను ఈ కెమెరాలతో రికార్డు చేసి, వాటిని నేరుగా ‘ముమ్తతిల్’ (Mumtathil) అప్లికేషన్‌తో అనుసంధానిస్తున్నారు. దీంతో తనిఖీల ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు అధికారులు, సంస్థల యజమానుల హక్కులను కూడా పరిరక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఆహార రంగంలో పనిచేసే సిబ్బందికి ఆరోగ్య ధ్రువపత్రాల జారీని మరింత సులభతరం చేయడంతో పాటు వాటిని ఎలక్ట్రానిక్ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇదిలా ఉండగా.. మున్సిపాలిటీలు, స్థానిక అధికారులు రెస్టారెంట్లు, వంటశాలలు, ఆహార విక్రయ కేంద్రాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య నిబంధనల అమలు, ఆహారం తయారీ, నిల్వ, నిర్వహణ విధానాలను పరిశీలిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలను గుర్తించి, అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆహార విక్రయ కేంద్రాల్లో ఏవైనా ఉల్లంఘనలు లేదా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే అధికారులకు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com