183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!

- August 12, 2026 , by Maagulf
183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!

దుబాయ్: యూఏఈకి చెందిన ‘జైవాన్’ (Jaywan) చెల్లింపు కార్డుల వినియోగం ఇకపై అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించనుంది. ఈ మేరకు ఎతిహాద్ పేమెంట్స్, యూనియన్‌పే ఇంటర్నేషనల్‌తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఆగస్టు 11న చైనాలోని షాంఘైలో యూనియన్‌పే ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎతిహాద్ పేమెంట్స్ బోర్డు చైర్మన్ సైఫ్ హుమైద్ అల్ ధహేరీ, యూనియన్‌పే చైనా, యూనియన్‌పే ఇంటర్నేషనల్ బోర్డు చైర్మన్ డాంగ్ జున్‌ఫెంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా జైవాన్ కార్డులను 183కి పైగా దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా పాయింట్ ఆఫ్ సేల్ (POS) కేంద్రాల్లో, అలాగే  18 లక్షలకు పైగా ఏటీఎంలలో వినియోగించుకునే అవకాశం కలగనుంది.

యూఏఈ వెలుపల జైవాన్ కార్డులతో జరిగే లావాదేవీలను యూనియన్‌పే ఇంటర్నేషనల్.. ఎతిహాద్ పేమెంట్స్ నిర్వహించే ఎమిరేట్స్ ఎలక్ట్రానిక్ స్విచ్ వ్యవస్థకు బదిలీ చేయనుంది. కార్డుల అంతర్జాతీయ విస్తరణకు అవసరమైన సెటిల్‌మెంట్, లిక్విడిటీ, విదేశీ మారక సేవలకు సంబంధించి ప్రత్యేక అవగాహన ఒప్పందం కూడా అమలు చేయనున్నారు.ఈ భాగస్వామ్యం ద్వారా యూఏఈకి చెందిన స్థానిక చెల్లింపు కార్డు వ్యవస్థ అంతర్జాతీయ పోటీతత్వం పెరగడంతో పాటు, చెల్లింపుల సెటిల్‌మెంట్‌లో స్థానిక కరెన్సీల వినియోగం మరింత సమర్థవంతం అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎతిహాద్ పేమెంట్స్, యూనియన్‌పేతో కలిసి యూఏఈలోని ఆర్థిక సంస్థల ద్వారా ‘జైవాన్–యూనియన్‌పే’ మల్టీ-సిస్టమ్ కార్డులను జారీ చేస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com