కువైట్‌లో 45.5 శాతం తగ్గిన కిడ్నాప్ కేసులు..!!

- August 18, 2026 , by Maagulf
కువైట్‌లో 45.5 శాతం తగ్గిన కిడ్నాప్ కేసులు..!!

కువైట్ : 2026 తొలి ఆరు నెలల్లో కువైట్‌లో కిడ్నాప్ సహా పలు తీవ్రమైన నేరాల సంఖ్య తగ్గింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కిడ్నాప్ కేసులు 45.5 శాతం తగ్గినట్లు న్యాయశాఖ మంత్రి కౌన్సిలర్ నాసర్ అల్-సుమైత్ తెలిపారు.

న్యాయశాఖ గణాంకాల ప్రకారం.. 2025 తొలి అర్ధభాగంలో 99గా ఉన్న కిడ్నాప్ కేసులు 2026లో 54కు తగ్గాయి. పరువుకు సంబంధించిన నేరాలు కూడా 28 శాతం తగ్గాయి. గత ఏడాది 168 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 121 కేసులకు పరిమితమయ్యాయి.

వ్యక్తిగత స్వేచ్ఛపై దాడులకు సంబంధించిన తీవ్రమైన నేరాల్లోనూ తగ్గుదల నమోదైంది. బలవంతం, బెదిరింపు లేదా మోసపూరిత పద్ధతుల్లో జరిగిన అత్యాచార కేసులు 76 నుంచి 38కు తగ్గాయి. బలవంతపు అత్యాచార కేసులు 26.3 శాతం, సమ్మతి లేకుండా జరిగిన అత్యాచార కేసులు 30 శాతం తగ్గినట్లు మంత్రి వెల్లడించారు.

కస్టడీ హక్కు ఉన్న వ్యక్తుల నుంచి పిల్లలను కిడ్నాప్ చేసిన కేసులు 45.3 శాతం తగ్గగా.. హాని కలిగించే ఉద్దేశంతో బలవంతంగా కిడ్నాప్ చేసిన కేసులు ఏకంగా 64.3 శాతం తగ్గాయి.

చట్టపరమైన సంస్కరణలతో కఠిన చర్యలు

కువైట్‌లో శిక్షా వ్యవస్థను నిరంతరం అభివృద్ధి చేయడం, సమాజానికి చట్టపరమైన రక్షణను బలోపేతం చేయడం వల్లే నేరాల సంఖ్య తగ్గుతోందని మంత్రి తెలిపారు. శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 182ను రద్దు చేయడం కీలక చట్టపరమైన సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.

గతంలో ఉన్న ఈ నిబంధన ప్రకారం.. కిడ్నాప్ చేసిన మహిళను ఆమె సంరక్షకుడి సమ్మతితో చట్టబద్ధంగా వివాహం చేసుకుంటే, కేసు నమోదు చేయకుండా ఉండే అవకాశం ఉండేది. ఈ నిబంధనను రద్దు చేయడం ద్వారా నేరస్థులకు చట్టపరమైన మినహాయింపు లేకుండా బాధ్యతను మరింత కఠినతరం చేసినట్లు మంత్రి వివరించారు.

అదేవిధంగా కొత్తగా అమల్లోకి వచ్చిన గృహ హింస రక్షణ చట్టం బలహీన వర్గాలకు మరింత బలమైన చట్టపరమైన రక్షణ కల్పిస్తోందన్నారు. లైంగిక వేధింపులు, పిల్లలు లేదా చట్టపరమైన సామర్థ్యం లేని వ్యక్తులపై గృహ హింస వంటి కేసుల్లో ఫిర్యాదును ఉపసంహరించుకోవడం, రాజీ పడటం లేదా నిందితుడిని క్షమించడం వంటి అవకాశాలను చట్టం నిరోధిస్తుందని తెలిపారు.

చట్టపరమైన వ్యవస్థను ఆధునికీకరించడం, శిక్షా మరియు న్యాయపరమైన చట్టాలను సమీక్షించడం ద్వారా హక్కులు, స్వేచ్ఛలకు మరింత రక్షణ కల్పించడంతో పాటు భద్రతను బలోపేతం చేసి, చట్టబద్ధ పాలనను మరింత పటిష్ఠం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాసర్ అల్-సుమైత్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com