మన్నించు.... ఓ ప్రేమా !

- August 17, 2016 , by Maagulf

ఎలా కలిసామో

ఎందుకు కలిసామో
కలిసే ఎందుకు నడుస్తున్నామో

ఎంతో కొంత అనుభవించాము 
జీవితాన్ని తీయగానే చేదుగానో
అడుగులకూ ఎంతో కొంత తెలుసు 
నువ్వు 
నేను 
మన ప్రపంచం

బరువంతా బయటకు పంపేసి 
గుండెనిండా నన్ను మాత్రమే ఒంపుకుంటావు నువ్వు 
చీకటి కళ్ళల్లో వెలుతురులా 
నిన్ను మాత్రమే నింపుకుంటాను నేను

అద్దం ముందు మనం 
అద్దంలో ఎడారి
ఓ చినుకు కోసం మనమింకా ఎదురుచూస్తున్నామని
తెలియని మేఘం ఒకటి కురవకుండానే వెళ్ళిపోయింది 
పొడి పొడి ఆవేశాలతో మబ్బులు 
ఎక్కడా తడి లేదు

జీవితాన్నే విడిచి నడిచి వెళ్ళాక 
దూరం ఎంతైతే యేమిటి

అయినా.....
అమాస చీకటి మీద ఏ కోపమూ లేదు నీకు  
పున్నమి వెన్నెల మీద ఏ ఆశ లేదు నాకు

కలగానో
కథగానో 
అనుకోకుండానో
మట్టిలో.....నే ఇంకిపోయినా 
మాటేదో వినాలనుకుంటావు 
కళ్ళల్లో నేను
చేతిలో  బూడిద
దుఃఖం ఆకాశమవుతుంది నీకు

పారువెల్ల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com