పిల్లల సోషల్ మీడియాపై ఆంక్షలు.. యూఏఈ స్కూళ్లో మారనున్న పరిస్థితులు..!!

- August 21, 2026 , by Maagulf
పిల్లల సోషల్ మీడియాపై ఆంక్షలు.. యూఏఈ స్కూళ్లో మారనున్న పరిస్థితులు..!!

దుబాయ్: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసే కొత్త నిబంధనల నేపథ్యంలో యూఏఈలో పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఆంక్షలు విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, సామాజిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యా, మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సోషల్ మీడియాకు దూరం కావడం వల్ల ఆన్‌లైన్ దృష్టి మళ్లింపులు తగ్గడం, ఇతరులతో పోల్చుకునే ధోరణి తగ్గడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యక్ష సంబంధాలు పెరగడం వంటి ప్రయోజనాలు ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రారంభ దశలో కొంతమంది పిల్లల్లో అసహనం, ఒంటరితనం, స్నేహితుల నుంచి దూరమవుతున్నామనే భావన, ‘తాము ఏదో కోల్పోతున్నామనే’ ఆందోళన తలెత్తవచ్చని హెచ్చరించారు.

జీఈఎంఎస్ ఎడ్యుకేషన్‌లో సేఫ్‌గార్డింగ్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం నిపుణురాలు క్లెయిర్ స్కోవెన్ మాట్లాడుతూ.. పిల్లల స్నేహాలు, సామాజిక జీవితంతో సోషల్ మీడియా బలంగా ముడిపడి ఉంటే ప్రారంభంలో వారు నిరాశకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అయితే సోషల్ మీడియా వినియోగం తగ్గితే ప్రత్యక్షంగా కలుసుకోవడం, క్రీడలు, ఇతర ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పారు. సోషల్ మీడియా వల్ల కలిగే దృష్టి మళ్లింపులు తగ్గడం వల్ల పిల్లలు పాఠాలపై మరింత ఏకాగ్రత చూపే అవకాశం ఉందన్నారు.

అయితే అన్ని రకాల స్క్రీన్ వినియోగాన్ని ఒకే విధంగా చూడకూడదని ఆమె సూచించారు. విద్యలో సాంకేతికత కీలకంగా ఉన్నందున పిల్లల్లో సమతుల్యమైన, ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను పెంపొందించడమే ముఖ్యమని పేర్కొన్నారు.

మెడ్‌కేర్ కమాలి క్లినిక్ కౌన్సిలర్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపిస్ట్ కరోలిన్ యాఫీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వినియోగం తగ్గితే ఆన్‌లైన్‌లో తమను తాము ఇతరులకు పరిపూర్ణంగా చూపించాలనే ఒత్తిడి తగ్గవచ్చన్నారు. అలాగే సైబర్ వేధింపులు, ఇతరులతో పోల్చుకోవడం తగ్గడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరగవచ్చని తెలిపారు. అయితే సోషల్ మీడియా పిల్లలు స్నేహితులతో మాట్లాడేందుకు, భావాలను వ్యక్తం చేసేందుకు, అవసరమైనప్పుడు మద్దతు పొందేందుకు కూడా ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. అందువల్ల ఆంక్షల సమయంలో పిల్లలు ఒంటరిగా భావించకుండా తల్లిదండ్రులు, పాఠశాలలు క్రీడలు, కళలు, హాబీలు, ఇతర పాఠ్యేతర కార్యక్రమాల వైపు వారిని ప్రోత్సహించాలని సూచించారు.

 

దుబాయ్‌లోని నాఫ్సాలజీ సైకాలజీ సెంటర్ నిపుణురాలు నష్వా తంతావీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు పరిమితులు విధించడం వల్ల సైబర్ వేధింపులు, సామాజిక పోలికలు, అనుచిత కంటెంట్‌కు పిల్లలు గురయ్యే ప్రమాదం తగ్గవచ్చన్నారు. మెరుగైన నిద్ర, కుటుంబంతో ఎక్కువ సమయం, ప్రత్యక్ష స్నేహ సంబంధాలు, హాబీలపై ఆసక్తి పెరగడం వంటి ప్రయోజనాలు కూడా ఉండవచ్చని తెలిపారు. అయితే ప్రతిరోజూ అలవాటైన సోషల్ మీడియాను ఒక్కసారిగా కోల్పోవడం పిల్లలపై భావోద్వేగ ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా వారి స్నేహితులు సోషల్ మీడియాను కొనసాగిస్తే బోర్‌గా అనిపించడం, అసహనం, ఒంటరితనం, స్నేహితుల నుంచి దూరమవుతున్నామనే భయం కలగవచ్చన్నారు. దీనిని ఆమె ‘సోషల్ గ్రీఫ్’గా అభివర్ణించారు.

పిల్లలపై ఆంక్షలను శిక్షగా కాకుండా జీవనశైలిలో మార్పుగా తల్లిదండ్రులు వివరించాలని నిపుణులు సూచించారు. ఫోన్ కాల్స్, ప్రత్యక్షంగా కలుసుకోవడం, విహారయాత్రలు, క్రీడలు, క్లబ్ కార్యకలాపాల ద్వారా స్నేహ సంబంధాలను కొనసాగించే అవకాశాలను కల్పించాలని చెప్పారు. సోషల్ మీడియా వినియోగం తగ్గితే విద్యార్థుల ఏకాగ్రత కూడా మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల దృష్టిని పదేపదే ఆకర్షించేలా రూపొందించబడటంతో ఎక్కువసేపు ఒక విషయంపై దృష్టి పెట్టడం కష్టమవుతోందని యాఫీ పేర్కొన్నారు. దృష్టి మళ్లింపులు తగ్గితే విద్యార్థులు పాఠాలను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చని, స్క్రీన్ సమయం తగ్గడం వల్ల నిద్ర, ఆరోగ్యకరమైన దినచర్యలు కూడా మెరుగుపడవచ్చని తెలిపారు. అయితే సమస్య కేవలం సోషల్ మీడియాతోనే పరిమితం కాదని నిపుణులు స్పష్టం చేశారు. డిజిటల్ వినియోగంతో పాటు వ్యాయామం, ప్రత్యక్ష సామాజిక సంబంధాలు, సృజనాత్మక కార్యకలాపాలకు కూడా తగిన సమయం కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.

సోషల్ మీడియాపై ఆంక్షలు ఉన్నప్పటికీ పిల్లలకు డిజిటల్ ప్రపంచంపై అవగాహన కల్పించడం కొనసాగించాలని నిపుణులు సూచించారు. వ్యక్తిగత గోప్యత, డిజిటల్ ఫుట్‌ప్రింట్, తప్పుడు సమాచారం, ఆన్‌లైన్ ప్రవర్తన, సోషల్ మీడియా అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయనే అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎలా రక్షించుకోవాలి, నమ్మదగిన సమాచారాన్ని ఎలా గుర్తించాలి, తప్పుడు వార్తలను ఎలా గుర్తించాలి, ఆన్‌లైన్‌లో ఇతరులతో గౌరవంగా ఎలా వ్యవహరించాలి వంటి అంశాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించాలని నిపుణులు తెలిపారు.

కొత్త నిబంధనల విజయవంతమైన అమలు కేవలం సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడంపైనే ఆధారపడదని, దానికి ప్రత్యామ్నాయంగా పిల్లలకు స్నేహాలు, క్రీడలు, హాబీలు, సృజనాత్మకత, కుటుంబ సమయం, తరగతి గది కార్యకలాపాలు అందుబాటులో ఉండేలా చేయడంపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com