ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!

- August 26, 2026 , by Maagulf
ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!

దుబాయ్: యూఏఈలోని ఉమ్ అల్ కువైన్‌లో జరిగిన మినీబస్ ప్రమాదంలో కేరళకు చెందిన 35 ఏళ్ల భారతీయ ప్రవాసి జేసన్‌ మృతి చెందారు.  జేసన్‌  అజ్మాన్‌లోని ఓ కాంట్రాక్టింగ్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో ఆయనతో పాటు సుమారు 14 మంది కార్మికులు మినీబస్‌లో ప్రయాణిస్తున్నారు. ఆగస్టు 17 తెల్లవారుజామున అజ్మాన్‌లోని నివాసం నుంచి ఉమ్ అల్ కువైన్‌లోని పని ప్రదేశానికి కార్మికులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సామాజిక కార్యకర్త సలీం నూర్ తెలిపారు.

అకస్మాత్తుగా డ్రైవర్ అస్వస్థతకు గురై వణికిపోవడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టినట్లు వెల్లడించారు. జేసన్ డ్రైవర్ పక్కనే ముందు సీటులో కూర్చుని ఉండటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. జేసన్ మృతదేహాన్ని కేరళలోని తిరువనంతపురానికి తరలించారు.

భార్యకు ఉద్యోగం వచ్చిన సమయంలో విషాదం
జేసన్, ఆయన భార్య కేరళకు చెందినవారు. ఈ దంపతులకు మూడు, ఆరు సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను బంధువుల వద్ద భారత్‌లో ఉంచి దంపతులు యూఏఈలో స్థిరపడ్డారు. జేసన్ ఐదేళ్లకు పైగా యూఏఈలో పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన భార్యకు షార్జాలోని ఓ క్లినిక్‌లో నర్సుగా ఉద్యోగం లభించింది. ఆమె వర్క్ వీసా ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

కాగా, ప్రమాదంలో గాయపడిన కొందరు కార్మికులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో కార్మికుడికి కాలు విరగడంతో మెరుగైన వైద్యం, విశ్రాంతి కోసం అతడిని భారత్‌కు పంపేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సలీం నూర్ తెలిపారు.

యూఏఈలో మినీబస్ ప్రమాదాలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఎమిరేట్స్ రోడ్‌పై ఓ మినీబస్ నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. మినీబస్‌ల భద్రతపై రోడ్డు భద్రతా నిపుణులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, యూఏఈ వ్యాప్తంగా ఇటువంటి వాహనాల వినియోగంపై నిషేధం విధించాలని కూడా కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com