ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు

- August 29, 2026 , by Maagulf
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వానికి చెట్లు నరకడం తప్ప, కొత్తగా నాటాలనే ఆలోచన రాలేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం నాటే సంస్కృతి కలిగి ఉందని, నరికే సంస్కృతి కాదని స్పష్టం చేశారు. హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అరణ్యారామంలో ‘అశ్వత్థ నారాయణ వివాహం’
మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో నిర్వహించిన ‘అశ్వత్థ నారాయణ వివాహం’ కార్యక్రమంలో నాగబాబు తన అర్ధాంగి పద్మజతో కలిసి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ దంపతులు రావి-వేప మొక్కలను నాటారు. భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, విచక్షణారహిత మైనింగ్, అడవుల నరికివేత చర్యలతో భూమాతకు తీవ్ర నష్టం కలిగిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


పర్యావరణ పరిరక్షణలో కూటమి విజన్
పర్యావరణ పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు తనకు ఒకేరకమైన ఆలోచనలు ఉన్నాయని నాగబాబు తెలిపారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉమ్మడి సంకల్పమే తమను ఒకే వేదికపైకి తెచ్చిందని చెప్పారు. భారతీయ సంప్రదాయంలో రావి, వేప చెట్లకు ఉన్న విశిష్ట స్థానాన్ని వివరిస్తూ, వీటిని కలిపి నాటడం వల్ల జీవవైవిధ్య పరిరక్షణకు మేలు జరుగుతుందని తెలిపారు.

రూ.24 కోట్లతో ‘అరణ్యారామం’ భవన నిర్మాణం
అనంతరం రూ.24 కోట్ల వ్యయంతో ప్రాంగణంలో నిర్మించనున్న ‘అరణ్యారామం’ భవన డిజైన్లను నాగబాబు పరిశీలించారు. భవన నిర్మాణాన్ని 10 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పీసీసీఎఫ్ చీఫ్ పి.వి. చలపతిరావు వివరించారు. ఈ భవన నిర్మాణం కోసం తొలగించాల్సి వచ్చిన 73 చెట్లను నరికివేయకుండా, వేరే ప్రాంతంలో విజయవంతంగా పునఃప్రతిష్ఠాపన చేయడంపై నాగబాబు అటవీ శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ నాగేశ్వరరావు, డీఎఫ్‌ఓ హిమశైలజ తదితర అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com