సినీ చరిత్రలోనే అతిపెద్ద టైటిల్‌తో ఆ నలుగురు డైరెక్టర్ మూవీ

- September 05, 2026 , by Maagulf
సినీ చరిత్రలోనే అతిపెద్ద టైటిల్‌తో ఆ నలుగురు డైరెక్టర్ మూవీ

‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, “ఇదీ సంగతి” ‘ఆటగదరా శివా’ తదితర చిత్రాలతో విలక్షణమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తాజాగా రూపొందించిన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. దీనికి ఉప శీర్షిక ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై ఆయనే సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘ఆ నలుగురు’ చిత్రంతో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇది మొట్ట మొదటి మిస్టరీ మ్యూజికల్ . సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ, ‘‘భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ ఇది.నా స్నేహితుడైన మదన్ తో ఈ కథను సినిమా గా చేద్దామనుకున్నాము. ఇది మదన్ చనిపోయే ముందు చివరిగా ప్లాన్ చేసిన సినిమా. నేను అప్పట్లో మదన్ కథతోనే ‘ఆ నలుగురు’ సినిమా తీశాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రతి రోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ వుంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ వుంటారు. అందుకే ఈ సినిమాకి ‘నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే టైటిల్ పెట్టాను.
ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది.ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం వుంది. ఇందులో నాలుగు పాటలున్నాయి. జే రెక్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈనెల 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.
హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా, సన్నీ, గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: మదన్, సంగీతం: జే రెక్స్, పాటలు: చంద్ర సిద్ధార్థ్, మాటలు: పులగం చిన్నారాయణ, ఆర్ట్: అంజి కొయ్యల, సినిమాటోగ్రఫీ: సామ్ సుప్రీత్ , ఎడిటింగ్: బొబ్బిలి భానుప్రకాశ్, గిరిధర్,
సహ నిర్మాతలు: అగస్త్య మంజు, సాగర్, మహి, సమర్పణ: వై.వి.సత్యనారాయణ రాజు, నిర్మాత - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com