2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!

- September 05, 2026 , by Maagulf
2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!

దుబాయ్: యూఏఈలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల పరిసరాల్లో మళ్లీ భారీ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ముఖ్యంగా ఉదయం విద్యార్థులను పాఠశాలలకు దింపే సమయం కార్యాలయాలకు వెళ్లే వారితో కలిసిపోవడంతో రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. కొన్ని కుటుంబాలకు తక్కువ దూరం ప్రయాణించడానికే ఎక్కువ సమయం పడుతోంది. దుబాయ్‌కు చెందిన ఓ పేరెంట్ అరిజిత్ నంది మాట్లాడుతూ..  తమ ఇంటికి పాఠశాల దూరం కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉన్నప్పటికీ, తన కుమారుడు స్కూల్ బస్సులో ఇంటికి చేరుకోవడానికి సుమారు 40 నిమిషాలు పడుతోందని తెలిపారు.

విద్యార్థులను వివిధ ప్రాంతాల్లో దింపాల్సి రావడంతో బస్సు ప్రయాణ సమయం పెరుగుతున్నప్పటికీ, ఉదయం పాఠశాల వద్ద పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటోందని చెప్పారు. ముఖ్యంగా ఎమిరేట్స్ హిల్స్ ప్రాంతంలోని పాఠశాల సమీప యూ-టర్న్‌ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయని తెలిపారు.

ప్రతి ఏడాది ఇదే పరిస్థితి

పాఠశాలలు తిరిగి ప్రారంభమైన వెంటనే రహదారులపై తేడా స్పష్టంగా కనిపిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అరేబియన్ రాంచెస్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు కూడా స్కూల్ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని తమ రోజువారీ షెడ్యూళ్లను మార్చుకుంటున్నాయి. అరేబియన్ రాంచెస్‌లో నివసిస్తున్న మజ్ద్ హకీమ్ మాట్లాడుతూ.. పాఠశాలలు తెరుచుకున్న వెంటనే రహదారులపై రద్దీ గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఉదయం డ్రాప్-ఆఫ్, మధ్యాహ్నం పిక్-అప్ సమయాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతూ, పాఠశాలల వద్ద క్యూలు ఏర్పడుతున్నాయని తెలిపారు.

 అజ్మాన్‌లోనూ ట్రాఫిక్ ప్రభావం

ఈ సమస్య దుబాయ్‌కే పరిమితం కాలేదు. ఇతర ఎమిరేట్లలోని పాఠశాలల వద్ద కూడా సాధారణ విద్యా, కార్యాలయ దినచర్యలు ప్రారంభం కావడంతో రద్దీ పెరిగింది. అజ్మాన్‌లోని అల్ జుర్ఫ్ ప్రాంతంలో ఉన్న వుడ్‌లెమ్ పార్క్ స్కూల్ రవాణా విభాగం ఇన్‌చార్జి ముజీబ్ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం మొదటి వారంలో సాధారణం కంటే ఎక్కువ ట్రాఫిక్ నమోదైందని తెలిపారు. అయితే కుటుంబాలు, పాఠశాల సిబ్బంది కొత్త సమయాలు, మార్గాలకు అలవాటు పడుతున్న కొద్దీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు.

ఉదయం ఎక్కువ ఇబ్బంది

ఉదయం విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లే సమయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల రద్దీ సమయంతో కలుస్తుండటంతో ట్రాఫిక్ మరింత తీవ్రంగా ఉంటోందని పాఠశాల రవాణా నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం పిక్-అప్ సమయంలో మాత్రం పరిస్థితి కొంత సాఫీగా ఉంటోందని పేర్కొన్నారు.

ప్రైవేట్ కార్లు ఎక్కువ

దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) గణాంకాల ప్రకారం, విద్యార్థుల స్కూల్ ప్రయాణంలో ప్రైవేట్ కార్లు ఇప్పటికీ ప్రధాన రవాణా మార్గంగా ఉన్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 20వేలకుపగా తల్లిదండ్రులతో నిర్వహించిన సర్వే ప్రకారం.. 47 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ వాహనాల్లో పాఠశాలలకు వెళ్తున్నారు. 44 శాతం మంది స్కూల్ బస్సులను ఉపయోగిస్తున్నారు.. మిగిలిన వారు వాక్, ప్రజా రవాణా, వ్యక్తిగత లేదా షేర్డ్ మొబిలిటీ సేవలను ఉపయోగిస్తున్నారు. పాఠశాల జోన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రాప్-ఆఫ్, పిక్-అప్ ప్రాంతాలను 91 శాతం మంది తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

అయితే, తక్కువ సమయంలో వేలాది వాహనాలు పాఠశాలల పరిసరాలకు చేరుకోవడంతో స్వల్ప ఆలస్యం కూడా భారీ క్యూలకు దారితీస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే దుబాయ్‌లోని ఆరు పాఠశాల జోన్‌లలో RTA ట్రాఫిక్ మెరుగుదల పనులు చేపట్టింది. ఈ చర్యల ద్వారా వాడీ అల్ సఫా 4, అల్ బర్షా, ఉమ్ అల్ షెయిఫ్, దుబాయ్ మోటర్ సిటీ, దుబాయ్ స్టూడియో సిటీ, అల్ సుఫౌహ్ ప్రాంతాల్లోని 10కి పైగా పాఠశాలలకు ప్రయోజనం కలగనుంది. అల్ కుద్ర రోడ్, హెస్సా స్ట్రీట్‌లను దుబాయ్ మోటర్ సిటీ, దుబాయ్ స్టూడియో సిటీ మీదుగా అనుసంధానించే కొత్త రహదారిని అభివృద్ధి చేశారు. దీంతో GEMS మెట్రోపోల్ స్కూల్ – మోటర్ సిటీకి రాకపోకలు సులభం కానున్నాయి.

అలాగే ఉమ్ అల్ షెయిఫ్‌లోని హారైజన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద పార్కింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేశారు. అల్ బర్షా సౌత్ పాఠశాలల సముదాయం సమీపంలోని సర్వీస్ రోడ్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను కూడా మెరుగుపరిచారు. అల్ సుఫౌహ్‌లోని ది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ చౌయిఫాట్ – దుబాయ్ వద్ద ట్రాఫిక్ సదుపాయాలను అభివృద్ధి చేయగా, వాడీ అల్ సఫా 4లోని GEMS వించెస్టర్ స్కూల్ – దుబాయ్ పరిసరాల్లో రహదారి, భద్రతా పనులు చేపట్టారు.

డ్రైవర్లకు సూచనలు

పాఠశాల జోన్లలోకి ప్రవేశించే సమయంలో వాహనదారులు వేగాన్ని తగ్గించాలని అధికారులు సూచించారు. పాదచారుల క్రాసింగ్‌ల వద్ద వాహనాలను నిలిపేందుకు సిద్ధంగా ఉండాలని, పార్క్ చేసిన వాహనాల మధ్య నుంచి పిల్లలు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, షార్జాలోని అల్ జజాత్, అల్ హజానా ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభం కావడంతో రహదారి అభివృద్ధి, నిర్వహణ పనులను షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ పూర్తి చేసింది. అజ్మాన్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రారంభ రోజుల ట్రాఫిక్ సమస్యలు రానున్న వారాల్లో తగ్గుతాయని పాఠశాలలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పరస్పర సహకారంతో కొత్త సమయాలు, మార్గాలకు అలవాటు పడితే స్కూల్ ప్రయాణాలు మరింత సాఫీగా మారతాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com