తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..

- October 05, 2026 , by Maagulf
తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..

హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవుల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ, పండుగ సెలవుల సమయంలో ఎలాంటి ప్రత్యేక తరగతులు (Special Classes) నిర్వహించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు దసరా సెలవులు వర్తించనున్నాయి. పాఠశాలలకు అక్టోబర్ 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు అమల్లో ఉంటాయి. తిరిగి అక్టోబర్ 23న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అలాగే, ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. జూనియర్ కళాశాలలు అక్టోబర్ 22న తెరుచుకుంటాయి.

పండుగ వేడుకలకు అనువైన షెడ్యూల్

ఈసారి బతుకమ్మ, విజయదశమి వేడుకలు దసరా సెలవుల సమయంలోనే రావడం వల్ల విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశం లభించింది. ప్రాంతాన్ని బట్టి అక్టోబర్ 18 లేదా 19వ తేదీలలో సద్దుల బతుకమ్మ నిర్వహించనుండగా, అక్టోబర్ 20న విజయదశమి (దసరా) వేడుకలు జరగనున్నాయి. ముందస్తుగా ప్రయాణాలు, పండుగ ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ షెడ్యూల్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

స్పెషల్ క్లాసుల పై విద్యాశాఖ తీవ్ర హెచ్చరికలు

సెలవుల నిబంధనలను అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. సెలవుల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక తరగతులు లేదా ప్రాక్టీస్ క్యాంపులు నిర్వహిస్తే ఆయా విద్యాసంస్థల గుర్తింపుపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రస్తుతం తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 1న ప్రారంభమైన ఈ పరీక్షలు అక్టోబర్ 9వ తేదీ నాటికి పూర్తికానున్నాయి. పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచే విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com