ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు

- October 05, 2026 , by Maagulf
ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు అక్టోబర్ 6 నుంచి అమల్లోకి రానుంది.

దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఇంధన ఛార్జీలు దూరాన్ని బట్టి రూ.375 నుంచి రూ.1,300 వరకు ఉండనున్నాయి. ఇప్పటివరకు ఈ ఛార్జీలు రూ.275 నుంచి రూ.950 వరకు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన ఛార్జీలు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు పెరగనున్నాయి. ప్రస్తుతం ఇవి రూ.900 నుంచి రూ.10,000 వరకు ఉన్నాయి. ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జీలను నిర్ణయిస్తారు.

ఇండిగో చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంధన ఛార్జీలను పెంచింది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయని సంస్థ తెలిపింది. అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు నెలవారీగా 14 శాతం పెరిగినట్లు పేర్కొంది.

విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో జెట్ ఇంధనానికి దాదాపు 40 శాతం వరకు ఖర్చవుతుంది. ఇంధన ధరల్లో భారీ మార్పులు విమానయాన సంస్థల లాభదాయకతపై ప్రభావం చూపుతాయి.

ఇండిగో 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.382 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు భవిష్యత్తులో ఇంధన ధరలను ముందుగానే లాక్ చేసుకునే హెడ్జింగ్ విధానాన్ని పరిశీలిస్తామని సంస్థ గత మేలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com