సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!

- October 05, 2026 , by Maagulf
సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఐస్‌క్రీమ్ షాపుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను మునిసిపాలిటీస్ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖ తాజాగా సవరించింది. వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, ఆహార భద్రత ప్రమాణాలను పెంచడం, పెట్టుబడిదారులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ మార్పులు చేశారు.

ఉత్పత్తి నుంచి విక్రయం వరకు ఫుడ్ సేఫ్టీ

కొత్త నిబంధనల్లో ఐస్‌క్రీమ్ ఉత్పత్తుల స్వీకరణ నుంచి స్టోరేజీ, తయారీ, సర్వింగ్ వరకు ప్రతి దశలో ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా.. సరైన ఉష్ణోగ్రత నియంత్రణ, ఆహార పదార్థాల్లో ఉండే అలెర్జీ కారకాల వివరాల వెల్లడింపు, పరిశుభ్రత, స్టెరిలైజేషన్ విధానాలు, ఆహార భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

సిబ్బందికి హెల్త్ సర్టిఫికెట్లు తప్పనిసరి

ఐస్‌క్రీమ్ షాపుల్లో పనిచేసే సిబ్బంది హెల్త్ సర్టిఫికెట్లు పొందాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు రక్షణ దుస్తులు ధరించాలి. ఆహార భద్రతకు సంబంధించిన నిర్దేశిత విధానాలను తప్పనిసరిగా అనుసరించాలి.

ఎలక్ట్రానిక్ చెల్లింపులు.. QR కోడ్

కొత్త నిబంధనల ప్రకారం ఐస్‌క్రీమ్ షాపులు ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్ అందుబాటులో ఉంచాలి. అలాగే ప్రమాణీకరించిన QR కోడ్లను ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయడం, నిర్వహించడం సమయంలో పెట్టుబడిదారులు, వ్యాపార యజమానులు పాటించాల్సిన బాధ్యతలను కూడా సవరించిన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ మార్పులు ఐస్‌క్రీమ్ షాపుల వ్యాపార అభివృద్ధికి తోడ్పడటంతో పాటు వినియోగదారుల భద్రత, ఆహార నాణ్యత, సేవల ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com