బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్

- October 05, 2026 , by Maagulf
బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్

చెన్నై: ప్రముఖ విద్యాసంస్థలు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పిలానీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. విద్యా, పరిశోధనా రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు సంస్థలు ఐదేళ్ల భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.

ఈ మేరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ వి. రామ్‌గోపాల్ రావు, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలకు పరస్పర ఆసక్తి ఉన్న విద్యా, పరిశోధనా రంగాల్లో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, విద్యా-పరిశోధనా సమాచారాన్ని పంచుకోవడం, అకడమిక్ మెటీరియల్, ప్రచురణల మార్పిడి వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

విద్యార్థులకు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్

ఈ భాగస్వామ్యంలో ప్రధానంగా విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా బిట్స్ పిలానీ, ఐఐటీ మద్రాస్ విద్యార్థులు భాగస్వామ్య సంస్థలో అకడమిక్ కోర్సులు, పరిశోధనా కార్యకలాపాలు, ప్రాజెక్ట్ వర్క్ చేపట్టే అవకాశం పొందుతారు.

అలాగే సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఇతర విద్యా కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించనున్నారు. దీనివల్ల ఇరు సంస్థల అధ్యాపకులు, పరిశోధకులు పరస్పరం తమ నైపుణ్యాలు, ఆలోచనలను పంచుకునే అవకాశం ఏర్పడుతుంది.

ఈ సందర్భంగా వి. రామ్‌గోపాల్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకులు అత్యుత్తమ విద్యా వాతావరణాలను అందిపుచ్చుకునేలా చేయడం బిట్స్ పిలానీ లక్ష్యమని తెలిపారు. ఐఐటీ మద్రాస్‌తో భాగస్వామ్యం విద్యార్థుల మార్పిడి, సంయుక్త పరిశోధనలు, అధ్యాపకుల భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి మాట్లాడుతూ బిట్స్ పిలానీతో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. క్రిటికల్, ఎమర్జింగ్ టెక్నాలజీలు, వెల్‌నెస్ కార్యక్రమాలు సహా వివిధ రంగాల్లో కలిసి పనిచేయడంతో పాటు, ఇరు సంస్థల ఉత్తమ విధానాల నుంచి పరస్పరం నేర్చుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com