దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!

- October 05, 2026 , by Maagulf
దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!

దుబాయ్: పాఠశాల ప్రాంగణాల్లో పిల్లల ఫొటోలు, వీడియోలు తీసే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని దుబాయ్‌లోని ప్రైవేట్ స్కూళ్లు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర విద్యార్థులు లేదా సిబ్బంది అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోల్లో కనిపించేలా చిత్రీకరించకూడదని పాఠశాలలు స్పష్టం చేస్తున్నాయి. దుబాయ్‌లోని ఓ పాఠశాల తల్లిదండ్రులకు ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌లో యూఏఈ గోప్యతా నిబంధనలు, ప్రైవేట్ స్కూళ్లలో అమలవుతున్న తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నట్లు తెలిపింది.

 ఎక్కడెక్కడ ఫొటోలు తీయకూడదు?

ఈ మార్గదర్శకాలు కేవలం తరగతి గదులకే పరిమితం కావు. పాఠశాలలోని.. కారిడార్లు, ప్లేగ్రౌండ్లు, అసెంబ్లీ ప్రాంతాలు,  పిల్లలను స్కూల్‌కు తీసుకువచ్చే, తీసుకెళ్లే ప్రాంతాలు,  ఇతర పాఠశాల కార్యక్రమాలు వంటి ప్రదేశాల్లోనూ వర్తిస్తాయి. ఇతర విద్యార్థులు లేదా సిబ్బంది అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోల్లో కనిపించే అవకాశం ఉంటే వాటిని తీయకుండా ఉండాలని తల్లిదండ్రులు, సందర్శకులకు సూచించారు.

వాట్సాప్‌లో షేర్ చేసినా సమస్యే..

ఇతర విద్యార్థులు కనిపించే ఫొటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా షల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయకూడదని పాఠశాలలు సూచిస్తున్నాయి. ఒక కుటుంబ ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో మరో చిన్నారి స్పష్టంగా కనిపించినా, ఆ ఫొటోను కుటుంబ సభ్యుల పరిధి దాటి ఇతరులకు పంపడం ద్వారా గోప్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

యూఏఈ డేటా ప్రైవసీ చట్టం ఏం చెబుతోంది?

యూఏఈ డేటా ప్రైవసీ చట్టం ప్రకారం, చట్టంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక మినహాయింపులు తప్ప సాధారణంగా వ్యక్తిగత డేటాను సమ్మతి లేకుండా ప్రాసెస్ చేయరాదు. పాఠశాలల విషయంలో విద్యార్థుల హక్కులను కాపాడటం, వారి గోప్యతకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడం కూడా ప్రైవేట్ స్కూల్ నియంత్రణ వ్యవస్థలో భాగంగా ఉంది.

పిల్లల ఫొటోలు పూర్తిగా నిషేధం కాదు

అయితే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రత్యేక సందర్భాలను ఫొటోలు, వీడియోలుగా రికార్డ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించడం ఈ మార్గదర్శకాల ఉద్దేశం కాదని పాఠశాలలు స్పష్టం చేస్తున్నాయి. కాన్సర్టులు , అసెంబ్లీలు, స్పోర్ట్స్ డే వంటి కార్యక్రమాల్లో పాఠశాల నిర్దేశించిన ప్రదేశాలు, సమయాల్లో ఫొటోలు తీసుకునే అవకాశం కల్పిస్తారు. అధికారిక పాఠశాల ఫొటోగ్రఫీ కూడా ఇప్పటికే అమల్లో ఉన్న సమ్మతి, పిల్లల భద్రతా విధానాల ప్రకారం కొనసాగుతుందని పాఠశాల సర్క్యులర్‌లో పేర్కొంది.

స్కూల్‌కు రావడం అంటే అందరి ఫొటోలు తీయడానికి అనుమతి కాదు

పాఠశాల కార్యక్రమానికి తల్లిదండ్రులను అనుమతించినంత మాత్రాన అక్కడ ఉన్న ప్రతి చిన్నారి ఫొటో లేదా వీడియో తీసుకునేందుకు అనుమతి లభించినట్లు కాదని పాఠశాలలు గుర్తుచేస్తున్నాయి. పిల్లల ఫొటోలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి వెళ్లిన తర్వాత వాటిని ఎవరు మరింతగా షేర్ చేస్తారో నియంత్రించడం కష్టమవుతున్న నేపథ్యంలో, ఇతర పిల్లల గోప్యతను గౌరవించడం తల్లిదండ్రుల బాధ్యత అని పాఠశాలలు సూచిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com