కలలకు ఊపిరి పోయండి...మత్తుకు కాదు 2029 లోగానే నషా ముక్త్ తెలంగాణే లక్ష్యం

- October 28, 2026 , by Maagulf
కలలకు ఊపిరి పోయండి...మత్తుకు కాదు 2029 లోగానే నషా ముక్త్ తెలంగాణే లక్ష్యం

-మాదకద్రవ్యాల కట్టడికి విద్యాసంస్థల్లో ప్రవేశ సమయంలోనే ప్రతిజ్ఞ చేయించాలి
- విద్యార్థులు, యువతను చైతన్యపరిచేందుకు 60 రోజుల ప్రత్యేక కార్యక్రమం
-ఓయూలో నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, యువతకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు

హైదరాబాద్‌: కలల సాకారం కోసం పరుగులు తీయాల్సిన యువత.. మత్తు మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని  గవర్నర్‌  కోరారు.
 పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశ సమయంలోనే విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించే విధానాన్ని తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు వెల్లడించారు. నషా ముక్త్ తెలంగాణ సాధన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఇది సమాజమంతా కలిసికట్టుగా చేపట్టాల్సిన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో బుధవారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్‌) తెలంగాణ రాష్ట్ర శాఖ, ఓయూ NSS సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’ , “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్–2047” అవగాహన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

యువతే దేశానికి వెన్నెముక

దేశ భవిష్యత్తు కర్మాగారాలు, గనుల్లో కాకుండా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని గవర్నర్ పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడితే వికసిత్ భారత్‌, వికసిత్ తెలంగాణ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని అన్నారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తికే పరిమితం కాకుండా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుందని, యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారని, 2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం ‘విజన్ డాక్యుమెంట్ ఆన్ డ్రగ్ కంట్రోల్ 2026–2029’ను రూపొందించిందని తెలిపారు. 2029 లోగానే నషా ముక్త్ తెలంగాణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.

వ్యసన బాధితులను ఆదుకోవాలి

మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారిని అవమానించడం, సమాజం నుంచి దూరం పెట్టడం సరికాదని గవర్నర్‌ అన్నారు. వారికి సరైన వైద్యం, కౌన్సెలింగ్‌, కుటుంబ సభ్యుల సహకారం అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు. ‘మాదకద్రవ్యాలపై పోరాడాలి.. వ్యసనానికి గురైన వ్యక్తిపై కాదు’ అనే దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల చేతుల్లో జ్ఞానాన్ని అందించే పుస్తకాలు ఉండాలని, వారి కళ్లలో విజయ లక్ష్యాలు కనిపించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, జీవిత లక్ష్యాలను సాధించడం, దేశాభివృద్ధికి తోడ్పడటం ప్రతి యువకుడి బాధ్యత అని పేర్కొన్నారు.

ఐఆర్‌సీఎస్‌లో 1.28 లక్షల సభ్యత్వం

తెలంగాణలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యకలాపాల పురోగతిని గవర్నర్ ప్రస్తావించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 32 జిల్లా శాఖలకు మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు పూర్తయ్యాయని తెలిపారు. ఐఆర్‌సీఎస్ సభ్యత్వం 1.28 లక్షలు దాటిందని, జూనియర్ రెడ్‌క్రాస్‌, యూత్ రెడ్‌క్రాస్ విభాగాల్లో 16 లక్షలకు పైగా నమోదు జరిగిందని వివరించారు.
ఆపద మిత్ర కార్యక్రమంలో 6,000 మంది నమోదు కాగా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో సుమారు 50 వేల మంది సభ్యులున్నారని, మై భారత్ పోర్టల్‌లో 5.20 లక్షలకు పైగా యువత నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో 2,000 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ఆపద మిత్ర కార్యక్రమంలో చేరడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాలు యువతలో సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

60 రోజుల పాటు ప్రత్యేక అవగాహన

నవంబరు 14 బాలల దినోత్సవం నుంచి జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం వరకు 60 రోజుల ప్రత్యేక మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ కాలంలో పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సదస్సులు, ప్రదర్శనలు, కౌన్సెలింగ్‌ కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను యువతకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు. ఈ దిశగా విశేష కృషి చేసిన విద్యాసంస్థలను గుర్తించి సత్కరించాలని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థలు కేవలం డిగ్రీలు అందించే కేంద్రాలుగా కాకుండా నైతిక విలువలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించే వేదికలుగా మారాలని ఆకాంక్షించారు.

33 జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రారంభమైన అవగాహన స్ఫూర్తి రాష్ట్రంలోని ప్రతి పాఠశాల, కళాశాల, గ్రామం, ఇంటికి చేరాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు ప్రజా ఉద్యమంగా మారాలని అన్నారు. ప్రతి విద్యార్థి అవగాహన రాయబారిగా మారి ఇతరులను కూడా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించాలని సూచించారు.మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తామని, ఆరోగ్యవంతమైన నషా ముక్త్ సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

‘నషా ముక్త్ యువత – వికసిత్ తెలంగాణ’ ‘మాదకద్రవ్యాలకు నో చెప్పండి.. జీవితానికి అవును చెప్పండి’ అనే సందేశంతో యువత ముందుకు సాగాలని గవర్నర్‌ అన్నారు. ప్రతి విద్యార్థిలో మార్పును తీసుకువచ్చే శక్తి ఉందని, ప్రతి యువకుడు సామాజిక మార్పునకు నాంది పలకగలడని పేర్కొన్నారు. సమష్టి కృషితో తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

రెడ్ క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, విశ్వవిద్యాలయాలు, ఎన్‌ఎస్‌ఎస్‌ స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో పనిచేస్తూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన యువతే దేశాభివృద్ధికి బలమని, యువశక్తిని సద్వినియోగం చేసుకుని భారతదేశాన్ని ప్రపంచానికి మార్గదర్శకంగా నిలపాలని ఆకాంక్షించారు.

నషా ముక్త్ భారత్ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించాలి: గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్ మాట్లాడుతూ...
తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే మాదకద్రవ్యాల నియంత్రణకు శివ ప్రతాప్ శుక్లా ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. జిల్లాల పర్యటనలు, వివిధ వేదికల ద్వారా ప్రజలకు ఈ ముప్పుపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. యువ సైనికుడిగా గవర్నర్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు.

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని చెప్పారు.. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు అనుగుణంగా వ్యక్తిగతంగా, సమష్టిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.వందేమాతరం గీతం మన మాతృభూమి గొప్పతనాన్ని, వారసత్వాన్ని గుర్తుచేస్తుందని పేర్కొన్నారు.

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చొరవతో తెలంగాణలో రెడ్ క్రాస్ సభ్యుల సంఖ్య సుమారు 40,000 నుంచి 1,28,000కు పెరిగిందని తెలిపారు. అలాగే, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థుల సంఖ్య 17,000 నుంచి సుమారు 1,20,000కు చేరిందని వెల్లడించారు. రాష్ట్రంలోని సుమారు 2,000 పాఠశాలల్లో స్కౌట్స్ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు.

కార్యక్రమంలో భాగంగా గవర్నర్‌ నషా ముక్త్ భారత్ పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించి విద్యార్థులు, యువతతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఐఆర్‌సీఎస్ సభ్యులతో ఠాగూర్ ఆడిటోరియం నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు.

అదే సమయంలో అన్ని జిల్లాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ ర్యాలీ లు చేపట్టారు. పోస్టర్ లను ఆవిష్కరించారు.

 కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఆర్‌సీఎస్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ ఛైర్మన్‌ ఎం.దానకిశోర్‌, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కొమండూరు శశి కిరణ్, ircs, తెలంగాణ ప్రధాన కార్యదర్శి  రాములు,అధ్యాపకులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఎన్‌ఎస్‌ఎస్‌ స్వచ్ఛంద సేవకులు తదితరులు పాల్గొన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com