పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిపై ఖతార్‌ ఫోకస్..!!

- October 28, 2026 , by Maagulf
పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిపై ఖతార్‌ ఫోకస్..!!

దోహా: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, దేశంలో ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను సాధించడంపై ఖతార్‌ దృష్టి సారిస్తోంది. వరల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరమ్‌ సందర్భంగా ఇన్వెస్ట్‌ ఖతార్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ డాక్టర్‌ హమద్‌ రషీద్‌ అల్‌ నయిమీ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఖతార్‌ జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి ప్రాజెక్టులను ఆకర్షించడంతో పాటు, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలిక వృద్ధికి ఖతార్‌ స్థిరమైన, అనుసంధానమైన, పోటీతత్వం కలిగిన కేంద్రంగా ఉందని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించేందుకు ఫోరం ఉపయోగపడిందన్నారు.

పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడంలో డిజిటలైజేషన్‌ కీలక పాత్ర పోషిస్తోందని అల్‌ నయిమీ పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన సమాచారాన్ని అందించడం, అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేయడం, వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కూడా సహకారం అందించడం తమ ప్రాధాన్యతలని చెప్పారు.

QR2.8 బిలియన్లకు పైగా పెట్టుబడి ప్రాజెక్టులు

ఖతార్‌ ప్రవేశపెట్టిన $1bn నేషనల్‌ ఇన్సెంటివ్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇప్పటివరకు QR2.8bnకు పైగా విలువైన పెట్టుబడి ప్రాజెక్టులకు మద్దతు లభించిందని, 900కు పైగా ఉద్యోగాలు ఏర్పడ్డాయని ఆయన వెల్లడించారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన స్థానిక పెట్టుబడి వ్యయాల్లో ఐదేళ్లపాటు గరిష్ఠంగా 40 శాతం వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆధునిక పరిశ్రమలు, లాజిస్టిక్స్‌, సాంకేతికత, డిజిటల్‌ సేవలు, ఆర్థిక సేవల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఖతార్‌ నేషనల్‌ విజన్‌ 2030, మూడో జాతీయ అభివృద్ధి వ్యూహానికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను వైవిధ్యభరితం చేయడంలో ఈ పథకం కీలకమన్నారు.

స్టార్టప్‌లకు వెంచర్‌ క్యాపిటల్‌ నిధులు

ఇన్వెస్ట్‌ ఖతార్‌ గేట్‌వే ద్వారా పెట్టుబడిదారులకు వివిధ రంగాల సమాచారం, పెట్టుబడి అవకాశాలు, వ్యాపార స్థాపనకు సంబంధించిన మార్గదర్శకాలు, సంబంధిత సంస్థలతో అనుసంధానం కల్పిస్తున్నట్లు అల్‌ నయిమీ చెప్పారు.  AI, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ టెక్నాలజీల వంటి రంగాల్లో పెట్టుబడులపై ఖతార్‌ ప్రత్యేక ఆసక్తి చూపుతోందన్నారు. ఔషధాలు, రసాయనాలు, ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో అధిక విలువ కలిగిన తయారీ పరిశ్రమలను అభివృద్ధి చేయడమూ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com