భారీ వర్షాలకు సిద్ధమవుతోన్న బహ్రెయిన్‌..!!

- October 28, 2026 , by Maagulf
భారీ వర్షాలకు సిద్ధమవుతోన్న బహ్రెయిన్‌..!!

మనామా: 2026–2027 వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు బహ్రెయిన్‌ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థల తనిఖీలు, నీటిని తొలగించే పంపులు, వాటర్‌ ట్యాంకర్ల సిద్ధం, నీరు నిలిచే ప్రాంతాల గుర్తింపు, అత్యవసర బృందాల సమన్వయంపై దృష్టి సారించారు.  

సెప్టెంబర్‌ 30న నార్తర్న్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో రానున్న వర్షాకాల సన్నద్ధతపై చర్చించారు. నార్తర్న్‌ మున్సిపాలిటీ, విద్యుత్‌-నీటి అథారిటీ, ట్రాఫిక్‌ విభాగం, సివిల్‌ డిఫెన్స్‌, పోలీసు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

అక్టోబర్‌ 5న కూడా సంబంధిత మంత్రులు, మున్సిపల్‌ కౌన్సిళ్ల ప్రతినిధులు సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. మున్సిపల్‌ అత్యవసర బృందాలను ఏర్పాటు చేసి, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించడం, అవసరాలకు అనుగుణంగా వాహనాలు, పరికరాలను అందుబాటులో ఉంచే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

డ్రైనేజీ నిర్వహణే కీలకం

తక్కువ సమయంలో భారీ వర్షం కురిసినప్పుడు, డ్రైనేజీ వ్యవస్థ నీటిని వేగంగా తొలగించలేకపోతే రహదారులపై నీరు నిలిచే ప్రమాదం ఉంటుంది. డ్రైనేజీ మార్గాల్లో చెత్త పేరుకుపోవడం, అడ్డంకులు ఏర్పడటం, నీటిని తరలించే సామర్థ్యం సరిపోకపోవడం ఇందుకు కారణాలు కావచ్చని పబ్లిక్ వర్క్స్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. వర్షాల సమయంలో ప్రధాన రహదారులపై నీటిని తొలగించేందుకు పంపులు, వాటర్‌ ట్యాంకర్లను వినియోగిస్తారని పేర్కొంది.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాల సమయంలో వాహనదారులు వేగాన్ని తగ్గించాలని, నీటితో నిండిన రహదారులపై పరిస్థితి స్పష్టంగా తెలియకపోతే ప్రయాణించకుండా ఉండాలని సూచిస్తున్నారు. నీటిలో గుంతలు, ఇతర ప్రమాదాలు కనిపించకపోవచ్చు. డ్రైనేజీ మూతలను తెరవడం, చెత్తను వాటిలో వేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని మంత్రిత్వశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com