కెన్యాకు ప్రయాణంపై సౌదీ నిషేధం..!!

- October 31, 2026 , by Maagulf
కెన్యాకు ప్రయాణంపై సౌదీ నిషేధం..!!

రియాద్: ఎబోలా వైరస్ వ్యాప్తి ముప్పు నేపథ్యంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. కెన్యాకు సౌదీ పౌరులు ప్రయాణించడంపై నిషేధం విధించడంతో పాటు, ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులకు అన్ని రకాల వీసాల జారీని నిలిపివేసింది. కెన్యా నుంచి సౌదీ అరేబియాలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించింది.

 ఆరోగ్యశాఖ అధికారుల సమీక్ష అనంతరం ఈ ముందస్తు జాగ్రత్త చర్యలను అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం కెన్యా నుంచే కాకుండా, ఇతర దేశాల మీదుగా సౌదీకి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. గత 21 రోజుల్లో కెన్యాలో లేదా ఎబోలా వైరస్ ప్రభావిత ఇతర దేశాల్లో గడిపిన వారికి సౌదీలోకి ప్రవేశం ఉండదు.

ఎబోలా ముప్పు ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై సౌదీ అరేబియా 2019 జూలైలో తొలిసారిగా ముందస్తు ఆంక్షలు విధించింది. 2026 మేలో వాటిని మరింత కఠినతరం చేసింది. తాజాగా కెన్యాపై కూడా నిషేధం విధించింది. ఇదిలా ఉండగా, 2026 జూన్‌లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు సౌదీ పౌరుల ప్రయాణాలను నిలిపివేయడంతో పాటు, ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనా ఆంక్షలు విధించింది.

ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు పొరుగున ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాలు, ఇతర ప్రవేశ మార్గాల వద్ద ఆరోగ్య పరీక్షలు, వ్యాధి సంబంధిత వివరాల సేకరణ, ముందస్తు వైద్య చర్యలను కూడా బలోపేతం చేసింది.

మరోవైపు, సౌదీ అరేబియాలో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సౌదీ ప్రజారోగ్య సంస్థ 'వెఖాయా' (Weqaya) స్పష్టం చేసింది. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎబోలా వైరస్ వ్యాప్తికి సంబంధించిన పరిణామాలను పరిశీలిస్తున్నామని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com