దుబాయ్ పర్యాటకులకు గుడ్‌న్యూస్..!!

- November 02, 2026 , by Maagulf
దుబాయ్ పర్యాటకులకు గుడ్‌న్యూస్..!!

యూఏఈ: దుబాయ్ పర్యటనకు వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ఇకపై సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాల కోసం దుబాయ్ అధికారిక పర్యాటక వెబ్‌సైట్‌ Visit Dubai ద్వారానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ కొత్త విధానాన్ని నవంబర్ 1న దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త సేవతో పర్యాటకులు దుబాయ్‌లోని పర్యాటక ప్రాంతాలు, ఆకర్షణలు, ఈవెంట్లు, టికెట్ల వివరాలు తెలుసుకునే అదే వెబ్‌సైట్‌లో వీసా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల వేర్వేరు వెబ్‌సైట్లు, యాప్‌లను ఆశ్రయించాల్సిన అవసరం తగ్గనుంది.

Dh200 నుంచి వీసా ఫీజులు

Visit Dubai వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రత్యేక వీసా సమాచార విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వివిధ రకాల టూరిస్ట్ వీసాలు, దరఖాస్తు ఫీజులు, అవసరమైన పత్రాలు, ప్రాసెసింగ్ సమయానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. వెబ్‌సైట్ వివరాల ప్రకారం, 30 రోజుల సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా ఫీజు Dh200 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి VAT అదనం. సాధారణంగా దరఖాస్తు చేసిన మూడు పని దినాల్లో వీసా ప్రక్రియ పూర్తవుతుంది.

కొత్త కార్యక్రమాలను ప్రకటించిన షేక్ హమ్దాన్

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రి, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. దుబాయ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రెండు కీలక కార్యక్రమాలను చేపట్టారు. వాటిలో మొదటిది Visit Dubai ద్వారా వీసా దరఖాస్తుల సౌకర్యం కాగా, రెండోది Dubai Access Club. ఈ ప్రత్యేక సభ్యత్వ కార్యక్రమం ద్వారా తరచూ దుబాయ్‌ను సందర్శించే పర్యాటకులకు ప్రత్యేక ప్రయోజనాలు, అనుభవాలను అందించనున్నారు. ఈ క్లబ్‌లో ఆహ్వానం ద్వారా మాత్రమే సభ్యత్వం కల్పిస్తారు.

వీసాల జారీ బాధ్యత GDRFAదే

ప్రస్తుతం ముందస్తు టూరిస్ట్ వీసా అవసరమైన ప్రయాణికులు ప్రభుత్వ అధికారిక మార్గాలు, గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెన్సీలు, ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ వంటి విమానయాన సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్త విధానంతో Visit Dubai మరో దరఖాస్తు వేదికగా అందుబాటులోకి రానుంది. అయితే వీసా దరఖాస్తులను పరిశీలించడం, ఆమోదించడం, జారీ చేయడం వంటి బాధ్యతలు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ – దుబాయ్ (GDRFA Dubai) పరిధిలోనే కొనసాగుతాయి. కొత్త సేవకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

మూడు రకాల టూరిస్ట్ వీసాలు

Visit Dubai వెబ్‌సైట్‌లో ప్రస్తుతం మూడు రకాల వీసా కేటగిరీలను పేర్కొన్నారు. అవి సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ, ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాలు. సింగిల్, మల్టిపుల్ ఎంట్రీ వీసాలు 30 రోజులు, 60 రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉన్నాయి. అలాగే 80కి పైగా దేశాల పౌరులకు దుబాయ్‌లో వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉంది. GCC దేశాల పౌరులు వీసా లేకుండానే ప్రవేశించవచ్చు. GCC దేశాల్లో నివసించే ఇతర దేశాల పౌరులు ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com