మస్కట్‌లో దీపావళి సందడి..!
- November 02, 2026
మస్కట్: దీపావళి పండుగ సమీపిస్తుండటంతో ఒమన్ రాజధాని మస్కట్‌లో పండుగ సందడి మొదలైంది. ముఖ్యంగా స్వీట్స్ దుకాణాలు, బంగారు నగల షాపులకు వినియోగదారుల తాకిడి పెరుగుతోంది. పండుగ డిమాండ్‌ను అందుకునేందుకు స్వీట్స్ షాపుల యజమానులు ఉత్పత్తిని పెంచడంతోపాటు అదనపు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.
దీపావళి సందర్భంగా భారతీయులు సంప్రదాయ స్వీట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కాజు బర్ఫీ, బూందీ లడ్డూలు, బేసన్ నెయ్యి లడ్డూలు, మూంగ్ దాల్ బర్ఫీ, కాజు దిల్‌బహార్, సోన్‌పాప్డీ వంటి స్వీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మరోవైపు ధన్‌తేరస్, దీపావళి సందర్భంగా బంగారు నాణేలు, పెండెంట్లు, ఇతర ఆభరణాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
దీపావళి పూజల సమయంలో దేవతలకు స్వీట్లు నైవేద్యంగా సమర్పించడంతోపాటు, ఇంటికి వచ్చే అతిథులకు కూడా అందిస్తారని బాంబే స్వీట్స్ డైరెక్టర్ అలీ అస్గర్ వజీహీ తెలిపారు. అందువల్ల ఈ సమయంలో పెద్ద మొత్తంలో స్వీట్లను కొనుగోలు చేస్తారని చెప్పారు. వినియోగదారుల అభిరుచులు మారుతున్నప్పటికీ స్వీట్స్ దుకాణాలకు దీపావళి ఎంతో ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు.
ఒమన్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సందర్భంగా స్వీట్లు కొనుగోలు చేయడం సంప్రదాయమని, దానిని కొనసాగించాల్సిందేనని సూరజ్ కుమార్ అనే ప్రవాస భారతీయుడు తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థలో ప్రాంతీయ అధిపతిగా పనిచేస్తున్న పల్లవ్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రతి ఏడాది వ్యాపార సంబంధాలు ఉన్నవారికి, ఉద్యోగులకు స్వీట్లు బహుమతిగా ఇస్తానని, ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
డిమాండ్ పెరగడంతో బాంబే స్వీట్స్ ఇటీవల రోజులుగా అదనపు షిఫ్టుల్లో పనిచేస్తోంది. బెంగాలీ స్వీట్ల విక్రయాలు కూడా పుంజుకున్నాయని వజీహీ తెలిపారు. 1990 నుంచి సంప్రదాయ రుచులతో స్వీట్లు అందిస్తున్న ఈ సంస్థ దీపావళి కోసం ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. దిల్‌బహార్, జాంగ్రీ, మోతీచూర్ లడ్డూలు, కాజు కసాటాతోపాటు ఆధునిక రకాల స్వీట్లు, చక్కెర లేని స్వీట్లను కూడా విక్రయిస్తోంది. మిక్స్‌డ్ స్వీట్స్, నమ్కీన్ హ్యాంపర్లు, డ్రైఫ్రూట్స్ గిఫ్ట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. 100కు పైగా రకాల స్వీట్లలో బెంగాలీ స్వీట్లు, కాజు కట్లీ, కాజు రోల్స్, మోతీచూర్ లడ్డూలకు ఎక్కువ డిమాండ్ ఉందని వజీహీ వివరించారు.
బంగారు నగల కొనుగోళ్లలోనూ జోష్
స్వీట్స్ దుకాణాలతోపాటు మస్కట్‌లోని రువీ ప్రాంతంలోని నగల షాపుల్లోనూ కొనుగోలుదారుల సందడి పెరిగింది. ధన్‌తేరస్, దీపావళి సందర్భంగా చాలామంది చిన్న బంగారు నాణేలు, పెండెంట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ బడ్జెట్‌కు అనుగుణంగా బంగారం కొనుగోలు చేస్తూ సంప్రదాయాలను పాటిస్తున్నారు.
మరోవైపు మస్కట్‌లోని అనేక ప్రాంతాల్లో ఇళ్ల బాల్కనీలు, కిటికీలను రంగు రంగుల లైట్లతో అలంకరిస్తున్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. సంస్కృతంలోని 'దీప' (వెలుగు), 'ఆవళి' (వరుస) అనే పదాల నుంచి దీపావళి పేరు వచ్చిందని చెబుతారు.
ఇదిలా ఉండగా మస్కట్‌లోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వినోద కేంద్రాలు కూడా దీపావళి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, ఆఫర్లకు సిద్ధమవుతున్నాయి. స్వదేశానికి దూరంగా ఉంటున్న భారతీయ ప్రవాసులకు దీపావళి తమ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడంతోపాటు స్నేహితులు, ఇతరులతో పండుగ ఆనందాన్ని పంచుకునే ప్రత్యేక సందర్భంగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో దీపావళి సందడి..!
- డిసెంబర్ చమురు ఉత్పత్తి కోటా పై OPEC+ కీలక నిర్ణయం..!!
- ఎల్ఎన్జీ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- దుబాయ్ పర్యాటకులకు గుడ్‌న్యూస్..!!
- బహ్రెయిన్‌లో PACT ఆధ్వర్యంలో సందడిగా దాండియా నైట్..!!
- కువైట్‌లో 20 శాతం తగ్గిన కోర్టు కేసులు..!!
- దుబాయ్‌లో 10 నెలల్లో 48,950 మందికి జరిమానాలు..!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు..!!
- కువైట్‌లో కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న సంస్థపై దాడి..!!
- ఒమన్‌లో జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష..!!







