కువైట్లోడిజిటల్ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు..!!
- November 02, 2026
కువైట్ : కువైట్‌లో నగదు వినియోగం క్రమంగా తగ్గుతోంది. డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరగడంతో పాటు నగదు లావాదేవీలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. 2026 మొదటి తొమ్మిది నెలల్లో ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే సుమారు 9 శాతం తగ్గాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏటీఎంల ద్వారా 45.214 మిలియన్ నగదు ఉపసంహరణ లావాదేవీలు జరిగాయి. 2025 ఇదే కాలంలో ఈ సంఖ్య 49.123 మిలియన్లుగా ఉంది. అదే సమయంలో నగదు ఉపసంహరణల మొత్తం విలువ కూడా తగ్గింది. గత ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో KD6.635 బిలియన్లుగా ఉన్న నగదు ఉపసంహరణలు ఈ ఏడాది KD6.22 బిలియన్లకు పడిపోయాయి. అంటే KD414.5 మిలియన్లు (6.66 శాతం) తగ్గుదల నమోదైంది.
బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏటీఎంలలో నగదు నింపాల్సిన అవసరం గణనీయంగా తగ్గింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ప్రాంతీయ ఘర్షణల తొలినాళ్లతో పోల్చినా నగదుకు డిమాండ్ తగ్గినట్లు బ్యాంకులు గుర్తించాయి. ఏటీఎంలకే కాకుండా బ్యాంకు శాఖల ద్వారా నగదు ఉపసంహరణలు కూడా తగ్గుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో పాటు వాణిజ్య, సేవా రంగాల్లో నగదు లావాదేవీలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా ఈ మార్పునకు దోహదపడుతున్నాయి. వచ్చే ఏడాది నగదు వినియోగం తగ్గుదల 20 శాతానికి చేరవచ్చని బ్యాంకింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఇతర సంబంధిత విభాగాల సమన్వయంతో సుమారు 14 రకాల వ్యాపార, సేవా రంగాల్లో నగదు లావాదేవీలపై నిషేధాలు లేదా పరిమితులు విధించారు. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచడం, మనీలాండరింగ్‌ను అరికట్టడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. బంగారం, ఆభరణాలు, విలువైన లోహాలు, రత్నాల వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించారు. వాహనాల కొనుగోలు, విక్రయ సంస్థలు, షోరూమ్‌లు, పెర్ఫ్యూమ్, వివాహ ప్రదర్శనలతో సహా కొన్ని వాణిజ్య ఎగ్జిబిషన్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
మరో ఐదు విభాగాల్లో KD10కు మించిన నగదు చెల్లింపులను నిషేధించారు. వీటిలో ఫార్మసీలు, ఆరోగ్య సంస్థలు, ఫిట్నెస్ సెంటర్లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, పురుషులు, మహిళలు, పిల్లల సెలూన్లు, వైద్య సంస్థలు, ప్రజారోగ్యానికి సంబంధించిన పురుగుమందుల దిగుమతి, ఎగుమతి, నిల్వ సంస్థలు, హోటళ్లు ఉన్నాయి. అలాగే నగదు బదిలీల విషయంలో KD1,000కు మించిన నగదు చెల్లింపులను కూడా అనుమతించరు. కొన్ని ఆరోగ్య సేవలకు ఫీజులు వసూలు చేసే సంస్థలకు ప్రత్యేక నగదు పరిమితులు వర్తిస్తాయి.
ఈ నిబంధనలను ఉల్లంఘించే వ్యాపార సంస్థలపై చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి సంస్థలను మూసివేయడంతో పాటు సంబంధిత దర్యాప్తు అధికారులకు అప్పగించే అవకాశం కూడా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!
- కువైట్లోడిజిటల్ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు..!!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!
- చైనా-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు..!!
- హార్ముజ్ జలసంధి తెరవడం పై ఇరాన్ కీలక ప్రకటన
- మస్కట్‌లో దీపావళి సందడి..!
- డిసెంబర్ చమురు ఉత్పత్తి కోటా పై OPEC+ కీలక నిర్ణయం..!!
- ఎల్ఎన్జీ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







